ఇవాటి నుంచి అమల్లోకి ఎన్నికల కోడ్‌ : వెంకట్‌ రావు

సూర్యాపేట, వెలుగు:  కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసినందున జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి  వస్తుందని   కలెక్టర్‌ వెంకట్‌ రావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ రాహుల్‌హెగ్డే, అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ లతతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, యాదాద్రి భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా.. 1201 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 

జిల్లాలో  9,97,065 మంది ఓటర్లు ఉన్నారని , 112 రూట్స్‌ఏర్పాటు చేసి 123 మంది సెక్టార్‌ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు.  18 క్యాటగిరీల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని,  12 ఎఫ్‌ఎస్‌టీ, 12 ఎస్‌ఎస్‌టీ, 4 వీఎస్‌టీ,  4 వీవీటి కలిసి 32 టీములతో పాటు ఎన్నికల నిర్వహణకు 6,635 మంది సిబ్బందిని సిద్ధం చేశామని చెప్పారు.   ఈసీఐ నిబంధనల మేరకు 85 ఏండ్లు పైబడిన వారికి , 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి హోమ్‌ ఓటింగ్‌ చేపడతామని చెప్పారు.  

అధికారులు, సిబ్బందికి  డ్యూటీ సర్టిఫికేట్‌తో పని చేసేచోట ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఇతర జిల్లాల అధికారులకు పోస్టల్‌బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తామని  తెలిపారు.  ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.  లైసెన్స్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకుంటామని, అన్ని చెక్‌పోస్టుల్లో గట్టి నిఘా పెంచుతామని చెప్పారు. ఇప్పటికే రెండు పోలీస్‌ బలగాలు జిల్లాకు వచ్చాయని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  డీపీఆర్‌‌వో రమేశ్ కుమార్, డీఈవో ఆశోక్, డీఈఈ మల్లేశం పాల్గొన్నారు.