ఎన్నికల కోడ్ బల్దియా ఆదాయానికి గండి కొట్టింది. జీహెచ్‌ఎంసీలోని అడ్వర్టైజింగ్ విభాగానికి హోర్డింగులు, యూనిక్ పోల్స్, గ్లోసైన్లు, లాలీ పప్స్ తో ప్రకటనల ద్వారా ఏటా రూ.40 నుండి రూ.45 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మున్సిపల్ సైట్లలోని లాలీ పప్స్ ద్వారా మూడేండ్లకు 12 కోట్లు గడిస్తుంది. ఫిబ్రవరిలో దీని టెండర్ ముగియగా ఎన్నికల కోడ్ కారణంగా మళ్లీ పిలవలేదు. దీంతో రెండు కోట్ల వరకు లాస్ కావాల్సి వచ్చింది. ఈ టైంలో పాత వ్యక్తులే తమ బిజినెస్ రన్ చేసుకున్నారు. మెట్రో రూట్‌లో అడ్డం ఉన్న హోర్డింగ్ లు, యూనిక్ పోల్స్ తొలగించిన బల్దియా, ఈ మధ్య రైలు ఆగడానికి కారణమవుతున్న వాటిని కూడా తీసేసే పనిలో పడింది. ఇది కూడా ఆదాయంలో కోతకు కారణమైంది.
జీహెచ్ఎంసీ అడ్వర్టైజింగ్ విభాగానికి ఎన్నికల కోడ్ దెబ్బ తగిలింది. ఇప్పటికే మెట్రో రవాణాకు హోర్డింగులు అడ్డంకిగా ఉండడంతో వాటిని తొలగించింది. దీంతో బల్దియా కోట్లలో ఆదాయాన్ని కోల్పోయింది. మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కొత్త యాడ్ ఏజెన్సీలకు అనుమతులిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రకటనల ద్వారా బల్దియాకు వచ్చే రాబడికి భారీగా గండిపడింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు వివిధ మార్గాల ద్వారా ఏటా వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రధానంగా ప్రాపర్టీ ట్యాక్స్, బిల్డింగ్ పర్మిషన్లు, లీజులు వుంటే.. తర్వాత స్థానంలో ట్రేడ్ లైసెన్సులు, అడ్డర్టైజింగ్ విభాగాలతోపాటు.. ఇతర అనుమతుల ద్వారా భారీగా రాబడి సమకూరుతుంది. జీహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం గ్రేటర్ లో 2500 వరకు హోర్డింగ్ లు, యూనిక్ పోల్స్, గ్లోసైన్లు, లాలీపప్స్ వున్నాయి. వీటి ద్వారా జీహెచ్ఎంసీకి ఏటా రూ.40 నుండి రూ.45 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే మెట్రో మార్గాల్లో ఇప్పటికే చాలా వరకు హోర్డింగ్ లు, యూనిక్ పోల్స్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
మెట్రో మార్గాల్లో ఆదాయం కోల్పోతున్న బల్దియా….
జీహెచ్ఎంసీకి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ మెట్రో మార్గాలే వున్నాయి. ఏ,బీ,సీ,డీ గ్రేడ్ లవారిగా ప్రకటనలకు రేట్లు ఫిక్స్ చేసి రెవెన్యూ వసూలు చేస్తోంది. అయితే భారీ ఆదాయం వచ్చే మేజర్ మార్గాల్లో మెట్రో రూట్ వెళ్లడంతో.. గతంలోనే ఆయా మార్గాల్లో వున్న హోర్డింగ్ లు, యూనిక్ పోల్స్ తొలగించింది బల్దియా. ఇక లేటెస్ట్ గా ఈదురుగాలులకు తరచూ హోర్డింగ్ లకు వున్న ఫ్లెక్సీలు చిరిగి మెట్రో ట్రెయిన్లకు అడ్డంగా పడుతున్నాయి. దీంతో తరచూ మెట్రో రైలు ఆగిపోవాల్సి వస్తోంది. దీంతో మెట్రో మార్గాల్లో వున్న మరో 200 హోర్డింగ్ లు యూనిక్ పోల్స్ తొలగించాలని హెచ్ఎంఆర్ బల్దియా అధికారులను కోరింది. దీంతో బల్దియా అడ్వర్టైజింగ్ విభాగం అధికారులు ఇప్పటికే ఆయా యాడ్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే వాటిని తొలగించే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త వాటికి పర్మిషన్లు, షిఫ్టింగ్ లకు అనుమతులపై బ్యాన్ వుండడంతో.. బల్దియా అడ్వర్టైజింగ్ విభాగానికి భారీగా గండిపడింది. ఏటా వచ్చే రెవెన్యూ లోనే రూ.10 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతున్నామని అధికారులు అంటున్నారు.
యాడ్ ఏజెన్సీలకు కలిసొచ్చిన కోడ్…
మెట్రో మార్గాల ద్వారా భారీగా ఆదాయం కోల్పోయిన బల్దియాకు.. ఎన్నికల కోడ్ కూడా నష్టాన్ని మిగిల్చింది. మున్సిపల్ సైట్లలో వున్న లాలీపప్స్.. అంటే రోడ్ల మధ్య డివైడర్లలో వున్న సైన్‌బోర్డుల ప్రకటనల ద్వారా బల్దియాకు ఏటా రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ప్రతి మూడేళ్ల కోసారి దీనికి సంబందించిన టెండర్ను కాల్ ఫర్ చేసి.. సెంటర్ మీడియంను ఏజెన్సీలకు కేటాయిస్తారు. దీని ద్వారా ప్రతి మూడేళ్లకు బల్దియా ఖజానాకు రూ.12 కోట్ల వరకు ఆదాయం చేరుతుంది. అయితే ఫిబ్రవరి తోనే టెండర్ గడువు ముగిసింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన టెండర్లు పిలవలేకపోయింది బల్దియా. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే టెండర్లు కాల్ ఫర్ చేయలేకపోయామని అడ్డర్టైజింగ్ విభాగానికి చెందిన అధికారులు తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలలకు దాదాపు కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు. అయితే ఈ మూడు నెలలుగా పాత యాడ్ ఏజెన్సీలే బిజినెస్ రన్ చేసుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత టెండర్లు పిలిచి కొత్త వాళ్లకు సెంటర్ మీడియం ప్రకటనల హక్కులు కల్పిస్తామన్నారు.