మేడిపల్లి/బషీర్‌బాగ్/కీసర, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రేటర్, శివారు ప్రాంతాల్లో పోలీసులు వెహికల్ చెకింగ్ చేపడుతున్నారు. భారీగా డబ్బును సీజ్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం నారపల్లిలోని వెంకటాద్రి టౌన్ షిప్ వద్ద పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.13 లక్షల 50 వేలను సీజ్ చేశారు. వాటిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు.
అబిడ్స్ పీఎస్ పరిధి చిరాగ్ గల్లీలోని హైదరాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అబిడ్స్ నుంచి యాప్రాల్‌కు వెళ్తున్న రవీందర్ అనే వ్యక్తి కారును అడ్డుకుని తనిఖీ చేశారు. కారులో రూ.5 లక్షలను గుర్తించారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి పేపర్లు చూపకపోవడంతో సీఐ నరసింహారాజు వాటిని సీజ్ చేశారు.
చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.2 లక్షల 76 వేలను స్వాధీనం చేసుకున్నారు.ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని ఏఏఏ సినిమాస్ వద్ద ఓ వెహికల్లో తరలిస్తున్న రూ.9 లక్షల 90 వేల క్యాష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పరిధిలోని విజేత సూపర్ మార్కెట్ వద్ద తనిఖీల్లో రూ.4 లక్షల 80 వేల 500ను పోలీసులు సీజ్ చేశారు.