- పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
- అధికారులు హై అలర్ట్
- పటిష్టమైన బందోబస్తు.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీలు
- ఉమ్మడి జిల్లాలో 13 స్థానాల నుంచి 235 మంది పోటీ
కరీంనగర్/నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సిబ్బంది పోలింగ్ సెంటర్లకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున 5.45 గంటలకు ఎలక్షన్స్ ఎజెంట్స్ సమక్షంలో మాక్ పోల్ నిర్వహిస్తారు. అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగడానికి పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీలు, ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను బుధవారం వారు పరిశీలించారు. సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఉమ్మడి జిల్లాలో 13 స్థానాల నుంచి 235 మంది పోటీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్లు కలిపి 235 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి 27 మంది పోటీ చేస్తున్నారు. రామగుండం నుంచి 23 మంది, హుజురాబాద్ లో 22 మంది, మంథని, సిరిసిల్లలో 21 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. హుస్నాబాద్ లో 19 మంది, పెద్దపల్లిలో 17 మంది, వేములవాడలో 16 మంది, పోటీలో ఉన్నారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురిలో 15 మంది చొప్పున బరిలో నిలిచారు. చొప్పదండిలో 14 మంది, మానకొండూరులో 10 మంది పోటీలో ఉన్నారు. 16 మంది కంటే మించి పోటీలో ఉన్న స్థానాల్లో రెండు ఈవీఎంలను వినియోగించనున్నారు.
గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలోని జ్యోతినగర్ జడ్పీ హెచ్‌ఎస్, రామగిరిలోని జేఎన్‌టీయూ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సీపీ రెమారాజేశ్వరి సందర్శించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత పెంచామని తెలిపారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద 1,261 మంది పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 2,231 మందిని బైండోవర్ చేసినట్టు సీపీ చెప్పారు.
హుజూరాబాద్: హుజురాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్నికల సిబ్బందితో సీపీ అభిషేక్ మహంతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ బూత్ వద్ద ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంగా విధులు నిర్వర్తించాలన్నారు. సిబ్బంది అంతా రూట్ ఆఫీసర్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనుమతి లేని పరికరాలు, వస్తువులను ఓటర్లు పోలింగ్ బూత్ లోనికి తీసుకెళ్లకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా విధులు నిర్వహించాలన్నారు.
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో , వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు డాక్టర్ జగదీశ్ సోన్ కర్, ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు జి. మణిగండసామి పరిశీలించారు. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ చేపట్టాలన్నారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని రికార్డలు చేయాలన్నారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు చెప్పాలని సూచించారు.
వేములవాడ, వెలుగు : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1700 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. రూట్ బందోబస్తు, పోలింగ్ స్టేషన్ బందోబస్తు, పెట్రోలింగ్ పోలీసుల విధులను వివరించారు. ఓటర్లు క్యూలైన్లు పాటించే విధంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. అనంతరం ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ కరుణాకర్ తో కలిసి పరిశీలించారు.