ర్యాలీలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉండండి: ఈసీ ఆదేశం
హైదరాబాద్: మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో 48 గంటలపాటు నిషేధం విధించింది. ఇవాళ అంటే శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన ఎలాంటి ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనరాదని.. అలాగే పత్రికా సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొనరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈనెల 25వ తేదీన ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే స్కీంలు అన్నీ ఆగిపోతాయని మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈయన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుంది. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
‘‘రూ.2వేల పెన్షన్ కావాల్నా ? వద్దా..? రైతు బంధు, 24 గంటల కరెంట్, దివ్యాంగులకు పెన్షన్ వంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్ కు ఓటేయాలె.. ఇవన్నీ ఆగిపోవాలంటే మోడీకి ఓటు వేయాలె’’ అని మంత్రి కామెంట్లు చేశారు. ఈయన ప్రసంగం నోట్ ను కూడా జిల్లా ఎన్నికల అధికారి ఈసీకి పంపారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ఈసీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడుతూ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. ఈ మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఈసీకి వివరణ ఇచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి ఇచ్చిన వివరణపై ఈసీ స్పందించి 48 గంటల నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.