జనసేనకు ఈసీ షాక్... గాజు గ్లాసు గుర్తు లేనట్లేనా...!

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ జనసేనకు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది ఈసీ. అంటే,జనసేన పోటీ చేస్తున్న 21అసెంబ్లీ స్థానాలు, 2ఎంపీ స్థానాలతో సహా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎవరైనా ఎక్కడైనా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయచ్చన్నమాట. ఈసీ నిర్ణయంతో జనసేనలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే గాజు గ్లాసును పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకుంటున్న జనసేనకు ఎన్నికల కమిషన్ నిర్ణయం కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టిందనే చెప్పాలి.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 26రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిందిఈసీ. ఈ క్రమంలో ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీలను గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలుగా ప్రకటించింది. తెలంగాణాలో ఎంఐఎమ్, బీఆర్ఎస్ పార్టీలు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్నాయి. జనసేనను రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ప్రకటించింది ఈసీ. ఈ క్రమంలో జనసేనకు గతంలో ఈసీ నుండి కేటాయించిన గాజు గ్లాసు గుర్తు కోల్పోయినట్లయింది.

ALSO READ :- Lambasingi OTT: ఓటీటీకి వచ్చేసిన గ్లామర్ దివి లంబసింగి..స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్లో కూడా పార్టీ గుర్తు గాజు గ్లాసు గురించి డైలాగ్స్ పెట్టి బాగా ప్రచారం చేయటంతో జనాల్లో కూడా బాగా రిజిస్టర్ అయ్యింది గాజు గ్లాసు గుర్తు. అంతే కాకుండా, ఇప్పటికే ఈ గుర్తుతో ప్రచారం కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీ జనసేన పార్టీ గుర్తును మార్చితే గనక జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ అంశంపై ఈసీతో సంప్రదింపులు జరిపేందుకు జనసేన న్యాయనిపుణులతో చర్చలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి, ఈ అంశంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.