మహారాష్ట్రలో ఇయ్యాల్నే పోలింగ్

మహారాష్ట్రలో ఇయ్యాల్నే పోలింగ్
  • 288 నియోజక వర్గాల్లో 4 వేలకు పైగా నేతల పోటీ
  • రాష్ట్రంలో 9.70 కోట్ల మంది ఓటర్లు
  • జార్ఖండ్​లో సెకండ్ ఫేజ్ కింద 38 సీట్లకు పోలింగ్
  • ఏర్పాట్లు పూర్తిచేసిన ఎన్నికల కమిషన్
  • సాయంత్రం ఎగ్జిట్ ​పోల్స్​ విడుదల

ముంబై : మహారాష్ట్ర, జార్ఖండ్​లలో బుధవారం నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్​లో రెండో ఫేజ్​లో భాగంగా 38 అసెంబ్లీ సెగ్మెంట్​లకు పోలింగ్ నిర్వహించనున్నారు. జార్ఖండ్​లో ఈ నెల 13వ తేదీన ఫస్ట్ ఫేజ్ కింద 43 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ నెల 23వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే), అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగాయి. 

నాందేడ్ లోక్​సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, శివసేన (యూటీబీ), ఎన్సీపీ (ఎస్పీ) పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిగా ఏర్పడ్డాయి. ఇక జార్ఖండ్​లో అధికార పార్టీ జేఎంఎం నేతృత్వంలో ఇండియా బ్లాక్, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బరిలో దిగాయి. బుధవారం పోలింగ్ ముగిసిన వెంటనే ఆరు గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతాయి. అదేవిధంగా, నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా బై ఎలక్షన్లు జరగనున్నాయి. కాగా, నవంబర్ 17 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 

అన్ని రాష్ట్రాల్లో కలిసి ఇప్పటి వరకు సుమారు రూ.1,000 కోట్లు విలువ చేసే లిక్కర్, డ్రగ్స్,  బంగారం, క్యాష్​తో పాటు ఓటర్లకు పంచేందుకు దాచిన తాయిలాలను ఎన్​ఫోర్స్​మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, జార్ఖండ్​లో 198 కోట్లు, బై పోల్ జరిగే 14 రాష్ట్రాల్లో రూ.223 కోట్లు సీజ్ చేశారు.

2019తో పోలిస్తే భారీగా పెరిగిన అభ్యర్థులు

మహారాష్ట్ర వ్యాప్తంగా 4,136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై ఆరు గంటలకు ముగుస్తది. వీరిలో 2,086 మంది ఇండిపెండెంట్లు, 150 మంది రెబల్స్ ఉన్నారు. 2019తో పోలిస్తే అభ్యర్థుల సంఖ్య 28% పెరిగింది. మొత్తం 9.70 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 5 కోట్ల మంది, మహిళా ఓటర్లు 4.69 కోట్ల మంది, ట్రాన్స్​జెండర్లు 6,101 మంది, దివ్యాంగులు 6.41 లక్షల మంది, సర్వీస్ ఓటర్లు 1.16లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 

6లక్షల మంది మంది ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. కాగా, బీజేపీ 149 స్థానాల్లో, శివసేన (ఏక్​నాథ్​షిండే) 81 సీట్లలో, ఎన్సీపీ (అజిత్ పవార్) 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన(యూటీబీ) 95 సీట్లలో, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి.

జార్ఖండ్​లో ఓటర్లు 1.23 కోట్ల మంది

జార్ఖండ్​లో రెండో ఫేజ్​లో భాగంగా 12 జిల్లాల్లో 38 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సీఎం హేమంత్ సోరెన్, స్పీకర్ రవీంద్ర నాథ్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బాబులాల్ మరాండి, సీతా సోరెన్, కల్పనా సోరెన్​తోపాటు పలువురు కీలక నేతల సెగ్మెంట్లకు బుధవారం ఓటింగ్ జరగనున్నది. 14,218 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

పాల్ఘర్​లో డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ నేత

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని విరార్‌‌లోని ఓ హోటల్‌‌లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డేతో కలిసి ఆ పార్టీ లీడర్లు డబ్బులు పంచుతున్నారని బహుజన్ వికాస్ అఘాడి (బీవీఏ) చీఫ్ హితేంద్ర ఠాకూర్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నాలసోపరా నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజన్ నాయక్.. 

ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతున్నారని బీవీఏ ఆరోపించింది. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్.. తన అనుచరులతో హోటల్‌‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ముంబైలో కోటి దాటిన ఓటర్లు

ముంబైలో (36 అసెంబ్లీ సెగ్మెంట్లు) 1.02 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో ముంబై సిటీ నుంచి 25.43లక్షల మంది, సబర్బన్ జిల్లాల నుంచి 47.61 లక్షల మంది ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 54 లక్షల మంది పురుషులు, 47లక్షల మంది మహిళలు, 1082 మంది ట్రాన్స్​జెండర్ ఓటర్లున్నారు. 85 ఏండ్లు పైబడినోళ్లు 1.46లక్షల మంది, దివ్యాంగులు 2,288 మంది ఉన్నారు. 10,117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.