మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా సంజయ్ కుమార్ మిశ్రాను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. ఎన్నికలు ముగిసేంత వరకు జిల్లాలో పర్యటిస్తారు. ఎన్నికల రూల్స్ ఉల్లంఘిస్తే 8522875618కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. కలెక్టర్ జి.రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
అనంతరం మహబూబ్ నగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీస్‌లోని కంట్రోల్ రూమ్ ను, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని గర్ల్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన దేవరకద్ర నియోజకవర్గ ఈవీఎంల తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకద్ర, జడ్చర్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్, ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు.
రానున్న 20 రోజులు కీలకం
నాగర్ కర్నూల్ టౌన్: జిల్లాలోని నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు మిథిలేశ్ మిశ్రా, సతీశ్‌కుమార్ సూచించారు. శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ తో కలిసి జిల్లా నోడల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని, ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలను లోబడి పని చేయాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తమకు అప్పగించిన బాధ్యతలను జవాబుదారీతనంగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ శాతం పెరిగేలా, ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ కె సీతారామారావు, నోడల్ ఆఫీసర్లు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఓటర్లను ప్రభావితం చేస్తే కంప్లైంట్ చేయండి
గద్వాల: ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే వారిపై, ప్రలోభాలకు గురి చేసే వారిపై కంప్లైంట్ చేయవచ్చని ఎన్నికల అబ్జర్వర్ అనుపం శర్మ తెలిపారు. శుక్రవారం టెన్త్ బెటాలియన్ లో ఆయనను కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ప్రజలు నేరుగా తనకు కంప్లైంట్ చేయవచ్చని తెలిపారు. 6301754688 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పారు.