సంక్రాంతికి పూర్తి చేయాలని భావిస్తున్న ఎలక్షన్ కమిషన్
ఈ నెల 13 నాటికి ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్
ప్రస్తుత రిజర్వేషన్లతోనే ఎలక్షన్.. వార్డుల డీలిమిటేషన్ లేదు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రెడీ అయింది. ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి శనివారం దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమై చర్చించారు. తర్వాత డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలు పబ్లిష్ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సంక్రాంతి పండుగలోపే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు తెప్పించారు. ఎలక్షన్ స్టాఫ్కు ట్రైనింగ్ ప్రాసెస్ కూడా పూర్తిచేశారు. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి.. నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
7న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్
శనివారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్ల వారీగా ఈ నెల 7న డ్రాఫ్ట్ ఫొటో ఎలక్టోరల్ రోల్స్ ప్రకటిస్తారు. 8 నుంచి 11 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9, 10 తేదీల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. అభ్యంతరాలను 12న పరిశీలించి పరిష్కరిస్తారు. 13న ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ పబ్లిష్ చేస్తారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ముగుస్తుందని, ఆలోగానే ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. గత ఎలక్షన్లో ఉన్న రిజర్వేషన్లతోనే ఈసారి ఎలక్షన్లు జరుగుతాయని వివరించారు.
74 లక్షల మంది ఓటర్లు
జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో 2020 జనవరి నాటికి 73 లక్షల 56 వేల 980 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటేసినా.. డివిజన్ వైజ్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవడానికి చాన్స్ ఇస్తారు. వారిని కలిపితే ఓటర్ల సంఖ్య 74 లక్షలు దాటుతుందని ఎలక్షన్ కమిషన్అంచనా వేస్తోంది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో.. పదివేలకుపైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
For More News..