ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయంగా రచ్చ నెలకొంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీని నిలిపివేయాలంటూ కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు ఇటీవల వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించద్దంటూ హైకోర్టును ఆశ్రయించాయి. వాలంటీర్లు రాజీనామా చేసి అధికార వైసీపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందని, ప్రజలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, వారి రాజీనామాలను ఆమోదించద్దని బీసీవై పార్టీ అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రామచంద్ర యాదవ్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వాలంటీర్ల రాజీనామాలపై వివరాలు, ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలని ఈసీని కోరింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఈసీ, ఇప్పటిదాకా 62వేల 571మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. రాత పూర్వకంగా కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి తెలిపిన కోర్టు విచారణను రెండు వారల పాటు వాయిదా వేసింది.
జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేకనే ప్రతిపక్షాలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని, రామచంద్ర యాదవ్ పిటిషన్ వెనక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించి పెన్షన్ పంపిణీని అడ్డుకున్న బాబు ఇప్పుడు రామచంద్ర యాదవ్ ను అడ్డు పెట్టుకొని వాలంటీర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. మరి, ఈ అంశంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.