ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటే జనసేన పార్టీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించిన ఈసీ ఆ గుర్తును పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించింది.దీనిపై హైకోర్టును ఆశ్రయించిన జనసేనకు అక్కడ కూడా నిరాశే మిగిలింది. తాజాగా ఈ అంశంలో మరో షాక్ ఇచ్చింది ఈసీ.
గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూటమి తరఫున దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. దీని వల్ల కూటమికి నష్టం కలుగుతుందన్న అంశాన్ని టీడీపీ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా, ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో గుర్తులు మార్చలేమని ఈసీ వాదించింది. దీంతో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.