ముంబై: ఎలక్షన్ కమిషన్ అధికారులు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే బ్యాగులను మంగళవారం మళ్లీ తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా థాక్రే ఉస్మానాబాద్ రాగా, ఈసీ అధికారులు ఆయనను ఆపి తనిఖీలకు సహకరించాలని కోరారు. ఆయన బ్యాగులను చెక్ చేస్తుండగా శివసేన లీడర్లు వీడియో రికార్డ్ చేశారు. కాగా, ఎన్నికల ప్రచారం కోసం సోమవారం థాక్రే యావత్మాల్ రాగా, అధికారులు ఆయన బ్యాగును చెక్ చేయడంతో థాక్రే ఫైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు కేవలం ప్రతిపక్ష నేతల లగేజ్లనే తనిఖీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, ఇతర సీనియర్ నేతల బ్యాగులను కూడా చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ‘అధికారుల జేబులు, ఐడీ కార్డులను మీరు చెక్ చేయండి’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, మహాయుతి కూటమి నేతలు కేవలం లోదుస్తుల్లోనే వస్తున్నారా? వారి బ్యాగులను ఎందుకు తనిఖీ చేయడం లేదని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. కానీ.. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒక్కొక్కరూ రూ. 25 కోట్ల చొప్పున పంపించారని, మహాయుతి లీడర్ల హెలికాప్టర్లను ఎలక్షన్ కమిషన్ అధికారులు
చెక్ చేయగలరా? అని రౌత్ ప్రశ్నించారు.
అందరినీ చెక్ చేస్తాం: ఈసీ
ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అగ్రనేతల హెలికాప్టర్లు, విమానాల్లో కూడా సోదాలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే థాక్రే బ్యాగును తనిఖీ చేసినట్టు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ బిహార్‌లో కొందరు నేతలు ఇవేరకమైన ఆరోపణలు చేశారని, ఆ సమయంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు సంబంధించిన విమానాలు, హెలికాప్టర్ల లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు.