ఏపీలో నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఇవాళ నామినేషన్లను పరిశీలించింది ఈసీ. కాగా, తప్పుడు వివరాలు ఉన్న పలు నామినేషన్లను పెండింగ్ లో పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించింది ఈసీ. ఈ క్రమంలో తెనాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించి అభ్యర్థికి షాక్ ఇచ్చింది ఈసీ. వివరాల్లోకి వెళితే, తెనాలి అసెంబ్లీ స్థానానికి మొదట షేక్ బషీద్ కి టికెట్ కేటాయించింది కాంగ్రెస్. బీ ఫారం కూడా బషీద్ కే కేటాయించటంతో అతను నామినేషన్ వేసారు.
అయితే, చివరి నిమిషంలో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చింది కాంగ్రెస్. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఏప్రిల్ 25న డాక్టర్ చందు సాంబశివుడిని తెనాలి ఎమ్మెలై అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. దీంతో చందు కూడా చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఎన్నికల సంఘం ఇద్దరు అభ్యర్థులకు షాక్ ఇస్తూ ఇద్దరి నామినేషన్లను రిజెక్ట్ చేసింది. ఈ క్రమంలో తెనాలి అసెంబ్లీ బరిలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బరిలో ఉండగా, కూటమి తరఫున జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం అనూహ్య రీతిలో పోటీలోనే లేకుండా పోయింది.