ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత జరిగిన హింసపై సీఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ పైనా వేటు వేసింది. ఆ మూడు జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.
రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి ఐసీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలంది. రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.