ఓట్లు రావాలి..సీట్లు రావాలి..అప్పుడే పార్టీలకు జాతీయ హోదా

దేశంలో 1,800కి పైగా పార్టీలున్నాయి. అంటే, సగటున ఒక్కో రాష్ట్రం పరిధిలో 59 పార్టీలున్నట్లు! వీటిలో జాతీయ హోదా ఉన్నవి కేవలం ఎనిమిది మాత్రమే. ఇవైనా టెక్నికల్​గా ఈసీ కంటిన్యూ చేస్తున్న పార్టీలు. తగినన్ని ఓట్లు, సీట్లు సాధిస్తేనే స్టేటస్ నిలుస్తుంది. వచ్చే మూడు నెలల్లో ఈసీ రివ్యూ చేయబోతోంది. నేషనల్​ స్టేటస్​ కొన్ని పార్టీలకు ఎగిరిపోవచ్చు. లేదా కొత్త పార్టీలు చేరవచ్చు.

నేషనల్​ పార్టీగా రికగ్నిషన్​ పొందడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ఎలక్షన్​ కమిషన్​ (ఈసీ) రూల్స్​ ప్రకారం తగినన్ని సీట్లు, లేదా ఓట్లు సాధించుకున్న పార్టీలకు మాత్రమే జాతీయ హోదా లభిస్తుంది. అలాంటివి మనకు ఎనిమిది పార్టీలున్నాయి. అయితే, వీటిలో మూడు పార్టీల భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈ గుర్తింపుగల పార్టీల్లో అతి పాతదైన కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా (సీపీఐ)తోపాటు తృణమూల్​ కాంగ్రెస్​ (టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) ఆ హోదాని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. తృణమూల్​ కాంగ్రెస్​ పశ్చిమ బెంగాల్​లో అధికారంలో ఉండగా, ఎన్సీపీ మహారాష్ట్రలో శరద్​ పవార్​ నాయకత్వంలో ఉంది. ఈ మూడు పార్టీలు ‘మాకు కొంచెం టైం కావాల’ని ఈసీకి రిక్వెస్ట్ పెట్టుకుని, ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆరు నెలల కిందటి లోక్​సభ ఎన్నికల్లో సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు తగినన్ని ఓట్లు, సీట్లు రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. మరో రెండు మూడు నెలల్లో జార్ఖండ్​ రాష్ట్రానికి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్​ యూటీలకు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అప్పటికీ ఈ పార్టీల పెర్ఫార్మెన్స్​ మెరుగ్గా లేకపోతే ఈసీ సమీక్షించి, ఈ మూడు పార్టీలకు రికగ్నిషన్​ కొనసాగించాలా, లేక తొలగించాలా అనేది నిర్ణయిస్తుంది.

ఈ ఏడాది చివరలో జార్ఖండ్​ అసెంబ్లీ ఎలక్షన్​ పూర్తవుతుంది. ఢిల్లీ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్​లున్నాయి. కాబట్టి, కనీసం అప్పటిదాకానైనా ఆగాలని సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ కోరాయి. దీంతో వాటి జాతీయ హోదాని రద్దు చేసే ఆదేశాల్ని ఈసీ పక్కనపెట్టిందని, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఈ ఇష్యూపై మరోసారి రివ్యూ చేస్తుందని అంటున్నారు. నిజానికి 2014 లోక్​సభ ఎన్నికల తర్వాత సీపీఐ, ఎన్సీపీలతోపాటు మాయావతి నాయకత్వంలోని బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ)కూడా డేంజర్​లో పడింది. అయితే, బీఎస్పీ లక్కీగా బయటపడింది​ గానీ, ఆ ప్లేస్​లోకి ఇప్పుడు టీఎంసీ వచ్చింది.

2014లో మారిన రూల్స్​

పొలిటికల్​ పార్టీలకు జాతీయ గుర్తింపునిచ్చే ప్రాసెస్ కోసం.. 2014 వరకు ఒక్క జనరల్​ ఎలక్షన్​ రిజల్ట్​నే లెక్కలోకి తీసుకునేవారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీల పనితీరును ఈసీ పరిశీలించి, షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ‘ఆ ఎన్నికల్లో మీ మీ పార్టీల పనితీరు రూల్స్​కనుగుణంగా లేదు కాబట్టి, నేషనల్​ స్టేటస్​ని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వండి’ అని ఈసీ ఆ మూడు పార్టీలకు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ఆయా పార్టీలు ఇచ్చిన వివరణలు పరిశీలించాక కాస్త సాఫ్ట్​గా ఉండాలని భావించింది. ఆ తర్వాత ఒకే లోక్​సభ ఎన్నికలకు బదులుగా, రెండు ఎలక్షన్ల ఫలితాలను రివ్యూ చేయాలని రూల్స్​ మార్చారు. కొత్త రూల్స్​ వచ్చిన తర్వాత బీఎస్పీ వివిధ రాష్ట్రాల్లో పుంజుకుని ప్రమాదం నుంచి తప్పించుకుంది. కానీ, మిగతా రెండు పార్టీలు (సీపీఐ, ఎన్సీపీ) 2019 ఎన్నికల్లోనూ పుంజుకోలేకపోయాయి. వీటికి టీఎంసీ కూడా జత కలిసింది. రూల్స్​ ప్రకారం పొందాల్సిన ఓట్ల శాతాన్ని ఈ మూడు పార్టీలు సాధించలేదు. అలాగే తాము పోటీ చేసిన రాష్ట్రాల్లోనూ ఉనికి చాటుకోలేకపోయాయి. ఎన్సీపీ ఈశాన్య రాష్ట్రాల్లో దెబ్బతింది. 2016లో నేషనల్​ పార్టీగా గుర్తింపు పొందిన టీఎంసీ ఇతర రాష్ట్రాల్లో వెనకబడటం పెద్ద మైనస్​ అయింది. దీంతో పరిస్థితి మొదటికొచ్చింది.

నేషనల్​ స్టేటస్​ పొందాలంటే..

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే అయిదు పెరామీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అయిదింటిలో దేనినైనా సాధించగలిగితే ఈసీ జాతీయ గుర్తింపును ఇస్తుంది. ఈ అంశాలను ‘ఎన్నికల గుర్తుల కేటాయింపు ఆర్డర్​–1968’ ప్రకారం పరిశీలిస్తారు.తాజాగా జనరల్​ ఎలక్షన్​లోగానీ, అసెంబ్లీ ఎన్నికల్లోగానీ కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేసి ఉండాలి. చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం సాధించాలి. ఏదైనా రాష్ట్రం లేదా వివిధ రాష్ట్రాల నుంచి కానీ కనీసం నలుగురు క్యాండిడేట్లు ఎన్నికవ్వాలి. కనీసం 4 రాష్ట్రాల్లో రీజనల్​ పార్టీగా గుర్తింపు. లోక్​సభలోని మొత్తం సీట్లలో కనీసం మూడు రాష్ట్రాలలో రెండు శాతం ఎంపీలను గెలవాలి. ప్రాంతీయ పార్టీ గుర్తింపు కోసం.. ఈసీ 2013లో జారీ చేసిన నోటిఫికేషన్​ ప్రకారం ఒక పొలిటికల్​ పార్టీ రాష్ట్ర (ప్రాంతీయ) పార్టీగా గుర్తింపు పొందాలంటే అయిదు అంశాలను పట్టించుకుంటారు. వీటిలో దేనిని సాధించగలిగినా స్టేట్​ పార్టీగా రికగ్నిషన్​ లభిస్తుంది.అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం పొందడం, మొత్తం సీట్లలో కనీసం రెండు స్థానాల్లో నెగ్గడం,   ఆ రాష్ట్రం వరకు లోక్​సభ ఎన్నికల్లో ఆరు శాతం చెల్లుబాటైన ఓట్లు, ఒక సెగ్మెంట్​ గెలుచుకోవడం,ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్​సభ స్థానాలకు ఒకటి గెలవడం,    ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు, లేదా మూడు సీట్లు సాధించడం,

రిజిస్టర్డ్​ పార్టీలు

జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపుల్లో ఏ ఒక్కటీ సాధించని పార్టీలను రిజిస్టర్డ్​ పార్టీలుగా పరిగణిస్తారు. ఏదైనా ఒక రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన పార్టీ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి. చిన్న రాష్ట్రాలైనట్లయితే.. 50 కన్నా తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాల్లో కనీసం 5 శాతం సెగ్మెంట్లలో బరిలో దిగాలి. లోక్​సభకు సంబంధించి 20 కన్నా తక్కువ సీట్లు ఉంటే కనీసం రెండు చోట్ల పోటీ చేయాలి. అప్పటివరకు వాటికి ప్రాంతీయ పార్టీ రికగ్నిషన్​ దక్కదు.

జాతీయ పార్టీ అయితే లాభాలేంటి?

పార్టీకి జాతీయ హోదాతో చాలా లాభాలుంటాయి.లాభాల్లో ముఖ్యమైంది ఎలక్షన్​ సింబల్​. స్టేట్​లో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీకి ఆ ఒక్క రాష్ట్రంలోనే పర్మనెంట్​ గుర్తు ఉంటుంది. నేషనల్​ పార్టీగా గుర్తింపు దక్కితే ఒకే సింబల్​తో అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయొచ్చు. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేయటంలో పార్టీ గుర్తు కీలక పాత్ర పోషిస్తుంది.

నేషనల్​ స్టేటస్​ వల్ల పార్టీ ఆఫీసుల నిర్మాణానికి తక్కువ రేటుకే జాగాలు పొందొచ్చు. ఎలక్షన్​ టైంలో ప్రసార భారతి (దూరదర్శన్​, ఆలిండియా రేడియో) ప్రసారాల్లో కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఆ స్లాట్​లో ఫ్రీగా ప్రచారం చేసుకోవచ్చు.

ఓటర్ల లిస్టు కాపీలను ఉచితంగా పొందొచ్చు.​

ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందినంత మాత్రాన అదే హోదా పర్మనెంట్​గా ఉండదు. దీంతో జాతీయ, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారుతూ ఉంటుంది. పైన చెప్పిన ఓట్ల శాతాలు, అవి పోటీ చేసిన రాష్ట్రాల్లో గెలుచుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల లెక్కలన్నీ ఈసీ పరిశీలించింది. దాంతో ఈ మూడు పార్టీలకు నేషనల్​ స్టేటస్​ కొనసాగించే విషయంలో 3 నెలల గడువు ఇచ్చింది. జార్ఖండ్​, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గనుక పూర్​ పెర్ఫార్మెన్స్​ ఉన్నట్లయితే వాటికి జాతీయ హోదా తొలగించే అవకాశముందని ఎనలిస్టులు చెబుతున్నారు.