ఏపీలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే..హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న 23 స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించలేదు ఎన్నికల సంఘం. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి మరో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్, ఛైర్పర్సన్, డివిజన్లు,వార్డు స్థానాలకు సంబందించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన క్రమంలో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 10 నుంచి 12 మధ్య ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని... 25వ తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో అక్టోబర్ 14న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో వీటి ప్రస్తావన లేదు. ఇప్పుడు హైకోర్టులో కేసులు పరిష్కారం అవ్వడంతో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పురపాలక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు ఇవే:
తణుకు, గుడివాడ, గూడూరు కందుకూరు, కావలి, నరసరావుపేట, పొన్నూరు, రాజాం, శ్రీకాళహస్తి, తాడిగడప, బాపట్ల, అల్లూరు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి, ఆముదాలవలస, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, చింతలపూడి, పొదిలి, బి.కొత్తపేట స్థానాలకు ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.
