ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు

  • ఒక్కో ఏరియా నుంచి 100–120 మంది​క్లరికల్, మినిస్టీరియల్​ సిబ్బంది సేవలు
  • సేవలు వాడుకునేందుకు ఎలక్షన్  కమిషన్  నుంచి యాజమాన్యానికి ఆదేశం

కోల్​బెల్ట్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సింగరేణి ఉద్యోగులు తమ సేవలు అందించనున్నారు.  కంపెనీలో పనిచేసే క్లరికల్, మినిస్టీరియల్​ సిబ్బంది సేవలను వినియోగించుకోవడానికి ఎలక్షన్​కమిషన్  నుంచి సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు వచ్చాయి. రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులతో పాటు సింగరేణి ఉద్యోగులు కూడా ఈసారి ఎన్నికల విధుల్లో సేవలు అందించనున్నారు. ఎన్నికల అధికారుల సూచన మేరకు అవసరాన్ని బట్టి ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా సుమారు 1500 మందిని ఎన్నికల విధులకు పంపించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 

సిబ్బందికి సంబంధించిన వివరాలను మేనేజ్ మెంట్ ఎలక్షన్​కమిషన్​కు అందజేసింది. ఎన్నికల నిర్వహణకు ఒక్కో ఏరియా నుంచి 100 నుంచి 120 మందికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఒక్కోసారి అనివార్య కారణాల వల్ల కొందరు విధులు నిర్వర్తించలేని పరిస్థితులు తలెత్తవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో 20 నుంచి 40 మందిని విధులకు సిద్ధం చేయనున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఎన్నికల విధులకు క్లరికల్, మినిస్టీరియల్​సిబ్బందిని పంపించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఎంపికైన వారిలో ఎగ్జిక్యూటివ్​ క్యాడర్​ఉద్యోగులు ఉంటే పోలింగ్​కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లుగా, క్లరికల్​ సిబ్బందిని పోలింగ్​బూత్​లలో వినియోగించుకునే చాన్స్​ఉంది. ప్రస్తుతం వారు పనిచేస్తున్న ప్రాంతంతో పాటు వారి స్వస్థలాలకు సంబంధంలేని నియోజకవర్గాల పరిధిలో విధులు కేటాయించనున్నారు. 

సర్కార్, సింగరేణి సహకారం

ప్రతి ఎన్నికల సమయంలో ప్రభుత్వం, సింగరేణి కంపెనీ పరస్పరం సహకరించుకుంటున్నాయి. సింగరేణిలో కేంద్రం 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం ఉంది.  ప్రతి ఎన్నికల విధులకూ సింగరేణి తమ ఉద్యోగులను కేటాయిస్తోంది. సింగరేణిలో కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యజమాన్యం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగుల సేవలనే వాడుకుంటోంది. 

కావాల్సిన బ్యాలెట్​ బ్యాక్సులను కేంద్ర ఎన్నికల కమిషన్​నుంచి తెప్పించుకుంటుంది. 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్  ప్రిసైడింగ్​ఆఫీసర్లు, పోలింగ్​ ఆఫీసర్లు, సూపర్​వైజర్లు, అసిస్టెంట్లతో సహా మొత్తం 468 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్​ విధులు నిర్వర్తించారు. సింగరేణి వ్యాప్తంగా 93 పోలింగ్​బూత్​లను ఏర్పాటు చేయగా కేంద్ర ఎన్నికల కమిషన్​ నుంచి 279 బ్యాలెట్  బాక్సులను తెప్పించారు. ఇక సాధారణ ఎన్నికల కోసం సింగరేణి కమ్యూనిటీ హాల్స్, ఆఫీసులు, విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. ఇలా సర్కారు, సింగరేణి పరస్పర సహకారంతో ఎన్నికలు జరుగుతున్నాయి.