మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల కమిషన్​ వేటు

మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల కమిషన్​ వేటు
  • బదిలీపై సాగనంపిన ఎన్నికల సంఘం
  • కొత్త డీజీపీగా వివేక్ పన్సాల్కర్​కు అదనపు బాధ్యతలు అప్పగింత

ముంబై: ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్, అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను ఎన్నికల సంఘం(ఈసీ) సోమవారం ట్రాన్స్​ఫర్ చేసింది. మహారాష్ట్ర కేడర్‌‌‌‌లోని నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఆ రాష్ట్ర సీఎస్​ను ఆదేశించింది. దీంతో సీనియర్​ ఐపీఎస్ అధికారి ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ పన్సాల్కర్‌‌‌‌కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్​కు చెందిన వివేక్ పన్సాల్కర్ డీజీపీగా నియమితులు కావడం ఇది రెండో సారి. గతంలో మాజీ డీజీపీ రజనీశ్ సేథ్ రిటైర్​మెంట్ తర్వాత.. డిసెంబర్ 31, 2023 నుంచి జనవరి 9, 2024 వరకు 10 రోజులు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించారు.

ఈసీకి నానా పటోలె లేఖ..

సీనియర్​ ఐపీఎస్​ రష్మీ డీజీపీగా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాశారు. అధికార మహాయుతి కూటమికి అనుకూలంగా.. ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ)కి వ్యతిరేకంగా ఆమె చర్యలు ఉంటున్నాయని అందులో తెలిపారు. ఎంవీఏ నేతలపై తప్పుడు కేసులు పెట్టాల్సిందిగా ఆమె సీపీలు, ఎస్పీలపై ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే గతంలో ఆమె రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్(ఎస్ఐడీ) కమిషనర్‌‌‌‌గా పనిచేసినప్పుడు ఎంవీఏ కూటమిలోని పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని.. ఆ రికార్డింగ్స్​అన్ని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​కు అందజేసేవారని ఆరోపించారు. 

పక్షపాత వైఖరితో వ్యవహరించే ఆమెను పదవి నుంచి తప్పించాలని ఈసీని కోరారు. ఈ నేపథ్యంలో ఈసీ ఆమెపై బదిలీ వేటు వేసింది. ఆమెపై గతంలో మూడు ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా నమోదయ్యాయి.   2023 లో డీజీపీగా బాధ్యతలు చేపట్టడానికి కొద్దిరోజుల ముందు రెండింటిని బాంబే హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న మరో కేసులో ఎంక్వైరీ ముంగింపు రిపోర్టును దర్యాప్తు సంస్థ ఇటీవల కోర్టుకు సమర్పించింది. 2024 జూన్​లోనే ఆమె రిటైర్​మెంట్ ఉండగా పదవీకాలన్ని మూడేండ్లు పెంచుతూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆదేశాలు జారీ చేసింది.