భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కోసం మన రాజ్యాంగం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఏర్పాటును ప్రతిపాదించింది. ఎన్నికల నిర్వహణను నియంత్రించి పర్యవేక్షించడంతోపాటు ఎన్నికల నిర్వహణలో అధికారులకు మార్గదర్శకాలను సూచించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు గురించి తెలుపుతుంది. ప్రధాన ఎన్నికల అధికారితోపాటు కొంత మంది ఇతర అధికారులను కూడా రాష్ట్రపతి నియమించవచ్చని పేర్కొంటున్నది.
భారత ఎన్నికల కమిషన్ 1950, జనవరి 25 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ పనిచేయడం ప్రారంభించిన తేదీని అంటే జనవరి 25ను ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుతున్నారు. 1950 అనే సంఖ్యను కేంద్ర ఎన్నికల కమిషన్ టోల్‌ఫ్రీ నంబర్‌గా వినియోగిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణ విషయంలో విస్తృతమైన అధికారాలు ఉన్నా అమలులో ఉన్న ఎన్నికల చట్టాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ తన అధికారాలను నిర్వహించరాదని భాగ్యోదయ జనపరిషత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల అధికార్లను నియమించేటప్పుడు ప్రధానంగా లా కమిషన్‌లో పనిచేసినవారు లేక సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తున్నారు.
ఎన్నికల కమిషన్‌లో మార్పులు
1950లో ఎన్నికల కమిషన్ ఏకసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేశారు. 1989లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు సభ్యులను అదనంగా నియమించారు. వి.పి.సింగ్ ప్రభుత్వం 1990లో ఎన్నికల కమిషన్‌ను తిరిగి ఏకసభ్య కమిషన్‌గా మార్చారు. 1991లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను బహుళ సభ్య కమిషన్‌గా మార్చడం కోసం 71వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టగా 2/3వ వంతు మెజార్టీని సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయింది.
కానీ సాధారణ మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించింది. అందువల్ల చట్టబద్ధతను పొందింది. 1993లో పార్లమెంట్ ఎన్నికల కమిషన్‌ను త్రిసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేయడానికి తన అంగీకారాన్ని తెలపడంతో ప్రస్తుత ఎన్నికల కమిషన్ చట్టబద్ధమైన కమిషన్‌గా ఉంది. 1995లో టీఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేయడాన్ని సమర్థించింది.
ఎన్నికల కమిషన్ నియామకం
ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని, ఇద్దరు ఇతర అధికారులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత్ పార్లమెంట్ రూపొందించిన శాసనాలను ఆధారం చేసుకొని ఇతర ఎన్నికల అధికారులు, ప్రాంతీయాధికారుల సర్వీసు నియమ నిబంధనలపై భారత రాష్ట్రపతి నిర్దేశం చేస్తారు. ప్రాంతీయ, ఇతర అధికారులను తొలగించే సందర్భంలో భారత రాష్ట్రపతి తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలి. రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు ఎన్నికల కమిషన్ కోరిక మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ అధికారులను సమకూర్చాల్సి ఉంటుంది.
ప్యానెల్ ఏర్పాటు
2023, మార్చి 2న దేశ అత్యున్నత న్యాయస్థానమైన భారత సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల ప్రధాన, ఇతర కమిషనర్ల నియామకానికి కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీరి నియామకం కోసం ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న అడ్వైజరీని ఏర్పాటు చేసింది. ఈ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్రపతి మాత్రమే సీఈసీ, ఈసీలను నియమించాలని తీర్పు ఇచ్చింది.
దీంతోపాటు ఎలక్షన్ కమిషన్‌కు ఇండిపెండెంట్ బడ్జెట్ ప్రత్యేక సెక్రటేరియట్ ఉంటుంది. పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఈ పద్ధతిని అనుసరించాల్సిందిగా జస్టిస్ కేఎం జోషేమ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.
ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు – 2023
ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2023, ఆగస్టు 10న రాజ్యసభలో కేంద్ర న్యాయశాక మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకున్నారు. ప్రధాన, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో ప్రధాన మంత్రి అధ్యక్షతన, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు సభ్యులుగా ఉంటారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఎవరూ లేకపోతే అతి పెద్ద పార్టీ విపక్ష నేతను సభ్యునిగా తీసుకుంటారు. కేంద్ర కార్యదర్శి స్థాయిలో ఉంటూ ఎన్నికల నిర్వహణపై అనుభవం ఉన్నవారిని కమిషనర్‌గా నియామకానికి పరిగణనలోకి తీసుకుంటారు. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరి ఎంపికలో ఐదుగురు వ్యక్తులతో కూడిన ఒక ప్యానెల్‌ను రూపొందించి కమిటీకి పంపిస్తారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్లు
దేశంలో పంచాయతీరాజ్ సంస్థలకు, పట్టణ, నగర పాలక సంస్థలకు 1992లో రాజ్యాంగంలో చేర్చిన 73, 74 రాజ్యాంగ సవరణలను అనుసరించి రాష్ట్రాల్లో ప్రత్యేక ఎన్నికల కమిషన్లను ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 243 కే, 243 జెడ్ఏ అధికరణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించిన ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది. పార్లమెంట్, శాసనసభల ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగబద్ధ సంస్థల ఎన్నికలతో సంబంధం ఉండదు.
నియామకం : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎన్నికల కమిషన్‌గా నియమిస్తారు. మరో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తారు. వీరితోపాటు కొంత మంది ఇతర అధికారులను కూడా వీరికి సహాయకులుగా నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవీకాలం సాధారణంగా ఆరు సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలుగా పేర్కొన్నా ఆచరణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవీకాలం ఐదు సంవత్సరాలుగా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే చట్టాలను అనుసరించి నిర్ణయిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవీకాలం పూర్తికాక ముందే అంటే మధ్యలో రాజీనామా చేయాలంటే తమ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించాలి.
తొలగింపు : 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలను అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి తొలగిస్తారు.
తొలగింపు ప్రక్రియ
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే అంటే అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలతో రాష్ట్రపతి తొలగిస్తారు. 124 (4)లో పేర్కొన్న పద్ధతిలోనే ఎన్నికల ప్రధాన అధికారిని పదవి నుంచి తొలగిస్తారు. ఎన్నికల ప్రధాన అధికారిని పదవి నుంచి తొలగించడం కోసం అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో గానీ రాజ్యసభలో గానీ ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ప్రవేశపెట్టిన సభాపతి ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు.
విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని మొదటి సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రెండో సభ కూడా 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన సందర్భంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రధాన అధికారిని పదవి నుంచి తొలగిస్తారు. అభిశంసన తీర్మానాన్ని ఆమోదించే సందర్భంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు అంటే ఒకసభ ఆమోదించి
మరో సభ తిరస్కరించినప్పుడు ఆ తీర్మానం వీగిపోయినట్లుగా పరిగణిస్తారు. అసమర్థత, దుష్ర్పవర్తన అనే కారణాలపై కేంద్ర కేబినెట్ ఎన్నికల అధికారులను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిన తర్వాత రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని కొలీజియంగా సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి తొలిగిస్తారు .