వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ డే రానే వచ్చింది. అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోని వెర్మంట్లో తెల్లవారుజామున 5 గంటలకు పోలింగ్ మొదలైంది. ఇక్కడ పోలింగ్ మొదలవడంతో అధికారికంగా యూఎస్ ఎలక్షన్ డే మొదలైంది. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నువ్వా-నేనా అనే రీతిలో సాగుతున్నాయి.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. డిక్స్విల్లే నాచ్ అనే ప్రాంతంలో మాత్రం అర్ధరాత్రే పోలింగ్ మొదలైంది. పోలింగ్ కూడా ముగిసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డిక్స్విల్లే నాచ్ అనే ప్రాంతంలో పోలింగ్ అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో కంటే ముందే నిర్వహించి పూర్తి చేయడం, రిజల్ట్స్ అనౌన్స్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. డిక్స్విల్లే నాచ్లో ఆరుగురు ఓటర్లు అర్ధరాత్రే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఆరు ఓట్లలో మూడు ఓట్లు ట్రంప్కు, మూడు ఓట్లు కమలా హారిస్గా మద్దతుగా పోల్ అవడం యూఎస్ ఎలక్షన్స్ ట్రెండ్ ఎలా ఉండబోతోందో స్పష్టం చేశాయి. డిక్స్విల్లే నాచ్లో రిజిస్టర్డ్ ఓటర్లు 6 మందే కావడం గమనార్హం.
డిక్స్విల్లే నాచ్తో పాటు హార్ట్స్ లొకేషన్, మిల్స్ ఫీల్డ్ ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రే పోలింగ్ మొదలవుతుంది. మొత్తం 50 రాష్ట్రాలలో ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అధ్యక్షుడిని ఎంపిక చేసే ఎలక్ట్రోరల్ కాలేజీ ప్రతినిధులను ఓటర్లు ఎన్నుకోనున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్, రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు.
మంగళవారం సాయంత్రం ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు మొదలు పెట్టి, అధికారులు వెంట వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్రాల వారీగా ఫలితాలు వెలువడేందుకు ఒక్కోసారి రోజుల తరబడి సమయం పడుతుంది. అయితే, ఎలక్ట్రోరల్ కాలేజీలో తమ మద్దతుదారులు కనీసం 270 సభ్యులను గెలిపించుకోగలిగిన అభ్యర్థి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటారు. గెలిచిన అభ్యర్థి వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపడతారు.