ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

ఖమ్మం టౌన్, వెలుగు  :  అధికారులు ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకొని ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీ ఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలల్లో పీవో, ఏపీవో, ఓపీవోలకు  విధులపై చేపట్టిన శిక్షణా కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీవో, ఏపీవో, ఓపీవోలు ఒక టీమ్ ల పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు.  

ఎన్నికల అధికారులు, బ్యాలెట్ యూనిట్, ఏజెంట్ల సీటింగ్ నమూనా మేరకు చేపట్టాలని చెప్పారు. పోలింగ్ యంత్రాల సమస్యలు ఎదురైతే వెంటనే సెక్టార్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా పోలింగ్ అధికారుల విధులు, భాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించారు. ఓటింగ్ యంత్రాలపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు ఉన్న పోలింగ్ సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయా సిబ్బంది, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటును వినియోగించుకోవాలన్నారు.

ఇతర నియోజకవర్గాల్లో ఓటుహక్కు ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ జారీచేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ బి. సత్యప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​ ఈ కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు ఎల్. రాజేందర్, మధు, మాస్టర్ ట్రైనీలు శ్రీరామ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శిక్షణ నోడల్ అధికారి అలీం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.