అహంకారం వర్సెస్ ఆత్మ గౌరవం మధ్య తెలంగాణలో ఎన్నికల పోరాటం జరుగుతోంది. ‘అహం బ్రహ్మాస్మి’ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. మరో వైపు గెలుపు కోసం నాయకుల మైండ్ గేమ్ కొనసాగుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు కూడా లేవు. అయినా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బేరసారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వివిధ పార్టీల ముఖ్య నేతల ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్ షో లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరుగనున్న తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఇది.
తెలంగాణ ఓటర్లు ఇప్పుడు మార్పును కోరుతున్నారు. ఏ ఆత్మ గౌరవం కోసం అయితే ప్రజలు తెలంగాణను పోరాడి సాధించుకున్నారో.. ఆ ఆత్మ గౌరవ మర్యాదల కోసం ఇప్పుడు మార్పు వైపు అడుగులు వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 85 వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే వన్ టూ వన్ పోటీ ఉంది. మిగిలిన స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా, ఐదు స్థానాల్లో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. 45 మందికి పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. వీరి మీద జనంలో నిరసన భావం స్పష్టంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నది. కాగా, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉన్న అనుకూల పరిస్థితిని నిలబెట్టుకునే పనిచేస్తున్నది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి, భంగపడిన నేతలే ఇప్పుడు కేసీఆర్ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు నెత్తికెక్కించుకున్న వారే ఇప్పుడు నేల కేసి కొట్టే పరిస్థితి ఉన్నది.
కర్నాటక ప్రజల తీర్పు తెలంగాణలో పునరావృతం
తెలంగాణ తీర్పు దేశంలోని తానా షాహీ గిరి రాజకీయాలకు ఒక గట్టి 'షాక్'ఇచ్చే పరిస్థితి ప్రజల్లో ఉన్నది. కర్ణాటక ప్రజల తీర్పు ఇప్పుడు తెలంగాణలోనూ పునరావృతం కానుంది. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులు, నేతలు ఫ్రస్ట్రేషన్లో ప్రత్యర్థుల మీద ఏది పడితే అది మాట్లాడుతూ నోరు జారుతున్నారు. పదవి అంటేనే అదో గండపెండేరంలా భావించే వారికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం కానున్నాయి. ' నా జులుం, నా అహంకార్ కా అధికార్ రహేగా, అబ్ అవామ్ కె హాత్ మే ఉస్ కి హార్ హోగి! రహేగా తో సిర్ఫ్ ప్యార్ రహేగా! వహి జీతేగా!'
(అహంకారం, దౌర్జన్యం చేసే అధికారం శాశ్వతంగా ఉండదు. దానికి ప్రజా కోర్టులో ఓటు ద్వారా ఓటమి తప్పదు. ప్రేమ ఒక్కటే మిగులుతుంది. అంతిమంగా ప్రేమే విజయం సాధిస్తుంది.) అని నాయకులు గుర్తిస్తే చాలు. ప్రజా దర్బార్ కాలం రానున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా.. ప్రజలకు జవాబుదారీ, ప్రజాస్వామ్య పాలన రాబోతున్నది. డిసెంబర్ 3 న జనం తీర్పు వెలువడనుంది. ప్రజలు ఆత్మగౌరవ తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించుకోనున్నారు.-----------
ఆత్మగౌరవానికే పెద్దపీట
అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల యాటిట్యూడ్ ఇప్పుడు వారి ఓటమికి ప్రధాన కారణం కాబోతున్నది. డబ్బు ఎంత గుమ్మరించినా, అధికార అహంతో ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ఆత్మ గౌరవం ముందు అన్నీ బలాదూర్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆత్మ గౌరవం ముందు అభివృద్ధి, సంక్షేమ జపం, ఉచితాల వాగ్దానాలు పేలవం అయిపోయాయి. అభ్యర్థుల గుణగణాలు, వ్యక్తిత్వం, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యతను సంతరించుకునే పరిస్థితి స్పష్టంగా ఉంది. అవినీతి, అక్రమాలు, నియోజకవర్గం ప్రజల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడాన్ని సామాన్య జనం జీర్ణించుకునే పరిస్థితి లేదు. మొత్తానికి తెలంగాణ తీర్పు ఈసారి దేశానికి మార్గదర్శకంగా మారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. జనంతో సంబంధం లేకుండా చేసే రాజకీయాలకు, ఎన్నికలు వచ్చినపుడే మీటింగ్లు, ఎన్నికల వ్యూహాలు రచించే పరిస్థితికి చరమ గీతం పాడే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఓవర్ ఆల్ గా ప్రజల మనోభావాలకు విలువను ఇచ్చేవారిని, తమ ఆత్మ గౌరవానికి భంగం కలుగకుండా చూసేవారికి పెద్దపీట వేసి ఎమ్మెల్యేలుగా ఎంపిక చేసే పరిస్థితి ఉంది. ఇదే నిజం. నేల మీది నిజం.
ALSO READ : పోలింగ్ పై అవగాహన కల్పించాలి : రాజీవ్ గాంధీ హన్మంతు
- ఎండి.మునీర్,
సీనియర్ జర్నలిస్ట్