
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి అన్నారు. ఆదివారం (మార్చి 16) కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లోపు కొత్త పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు.
పెండింగ్లో ఉన్న డీఏలు, మెడికల్, జీపీఎఫ్, సరెండర్ లీవ్, సప్లిమెంటరీ తదితర బిల్లులను ఈ నెలాఖరులోపే రిలీజ్ చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు డీఎస్సీ 2003 టీచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, ఫైనాన్స్ సెక్రటరీ ఆట సదయ్య, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, బి. రవి, జుట్టు గజేందర్, ఎవి. సుధాకర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.