మంచిర్యాల జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం :  కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధం :  కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ఈ నెల 27న జరగనున్న మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు.

మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి బ్యాలెట్ బాక్సులు, సామగ్రిని పరిశీలించారు. జిల్లాలో పట్టభద్రుల కోసం 40, ఉపాధ్యాయ ఎన్నికలకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

అర్హత గల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి 

ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారం, పరిశ్రమలు, ట్రేడ్ ఇతర సంస్థల్లో పని చేస్తున్న అర్హత గల ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు వేసేందుకు ప్రత్యేక సెలవు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఆయా సంస్థల యాజమాన్యాలు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సహకరించాలన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మంగళవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎఎస్ఆర్ కన్వెషన్ హాల్​లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిషనర్ శ్రీని వాస్ ఆదేశాల మేరకు బ్యాలెట్ల తరలింపు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంకు చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.

పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు 100 మీటర్ల పరిధిలో గుమిగూడకుండా, ఓటర్లు క్యూలైన్లు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన

కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని భైంసా రూరల్ సీఐ నైలు పరిశీలించారు. గ్రాడ్యుయెట్, టీచర్స్ పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించి స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎస్​ఐ భాస్కరాచారి, ఎంఈవో ముత్యం, సిబ్బంది పాల్గొన్నారు.