నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు, ఈవీఎంల రిసీవింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని ఎలక్షన్ అబ్జర్వర్ మిథిలేశ్మిశ్రా సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను అబ్జర్వర్లు బేరారామ్ చౌదరి, సతీశ్‌కుమార్, కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి పరిశీలించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రిసీవింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, నోడల్ ఆఫీసర్లతో చర్చించారు.
పోలింగ్, కౌంటింగ్ మధ్య సమయం తక్కువగా ఉన్నందున కౌంటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు మిషన్‌మోడ్‌లో పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల లేఅవుట్ ను పరిశీలించారు. కమ్యూనికేషన్ ప్లాన్ కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్లు, స్ట్రాంగ్‌రూమ్స్, భద్రతా చర్యలు, వీడియోగ్రఫీపై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ హాల్‌కు ఎంట్రీ, ఎగ్జిట్, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటర్‌నెట్ సౌకర్యంతోపాటు వెహికల్ పార్కింగ్ పై దిశానిర్దేశం చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ సమీపంలోకి ఇతరులను అనుమతించవద్దని, నిఘా పక్కాగా ఉండాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, కె. సీతారామారావు, ఆర్వో వెంకట్ రెడ్డి, డీఎస్పీ మోహన్ కుమార్, ఆర్అండ్ బీ ఈఈ భాస్కర్, సివిల్ సప్లై డీఎం బాలరాజ్, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రావు, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అందరూ సహకరించాలి..
గద్వాల: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఎన్నికల పరిశీలకుడు వసంత కుమార్ కోరారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రితిరాజ్, పోలీస్ పరిశీలకుడు అనుపమ్శర్మ, వ్యయ పరిశీలకుడు సమీర్ కుమార్ ఝాలతో కలిసి పొలిటికల్ పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రతిరోజు ఎన్నికల ఖర్చులు చూపించాలని సూచించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసు ఆఫీసర్ల తో మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. కౌంటింగ్ సెంటర్లలో సౌలతులు కల్పించాలని ఆదేశించారు.
నోడల్ ఆఫీసర్ల పాత్ర కీలకం
వనపర్తి: ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకమని అబ్జర్వర్ సోమేశ్మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేంద్ర సింగ్ తో కలిసి నోడల్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌలతులు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.