బైలాస్​కు విరుద్ధంగా టీఎన్జీవోస్ ఎలక్షన్లు

  •  సభ్యత్వ నమోదు పూర్తికాలే.. ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయలే..
  •  జిల్లాలో 800 మంది ఉద్యోగులకు 500 మందికే సభ్యత్వం
  •  లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, కన్నెపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికలు 
  •  టీఎన్జీవోస్ అభ్యంతరాలతో బెల్లంపల్లి యూనిట్ ఎలక్షన్ వాయిదా 
  •  బైలాస్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగుల డిమాండ్ 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవోస్) ఎన్నికలు బైలాస్​కు విరుద్ధంగా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. పలు అభ్యంతరాల నడుమ ఈ నెల 28, 29 తేదీల్లో చెన్నూర్, లక్సెట్టిపేట, మందమర్రి, కన్నెపల్లి నాలుగు యూనిట్ల ఎన్నికలు నిర్వహించగా.. బెల్లంపల్లి యూనిట్ ఎన్నిక రద్దయింది. మంగళవారం మంచిర్యాల యూనిట్ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. అయితే జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి కాకుండానే ఎన్నికలకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు వారం రోజుల ముందే ఓటర్ లిస్టును రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ చేయలేదు.

బైలాస్​కు విరుద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కొంతమంది యూనియన్ లీడర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆ సంఘం సభ్యులే మండిపడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి యూనిట్ టీఎన్జీవోలు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆదివారం జరగాల్సిన ఎన్నిక రద్దయింది.

సభ్యత్వ నమోదు ఎందుకు చేయలేదు?

జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, మందమర్రి, కన్నెపల్లి ఆరు యూనిట్ల పదవీకాలం నవంబర్​లో ముగిసింది. జిల్లా కమిటీ కాలపరిమితి డిసెంబర్ 27తో పూర్తయ్యింది. వెంటనే యూనిట్లకు ఎన్నికలు నిర్వహించి జిల్లా కమిటీని ఎన్నుకోవాల్సి ఉండగా, వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీనిపై టీఎన్జీవోస్​లో అసమ్మతి పెరగడంతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ నెల 28,29,30 తేదీల్లో ఆరు యూనిట్ల ఎన్నికలు నిర్వహించారు. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు పూర్తి చేసి ఎన్నికలకు వారం రోజుల ముందే ఓటర్ లిస్టును రిలీజ్ చేయాలి.

కానీ ఈ తతంగం ఏమీ లేకుండానే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని ఆరు యూనిట్లలో కలిపి సుమారు 800 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటివరకు 500 సభ్యత్వం మాత్రమే నమోదయినట్టు తెలిసింది. యూనియన్ బైలాస్​ను పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. 

నాలుగు చోట్ల ఏకగ్రీవంగానే..!

టీఎన్జీవోస్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఏకపక్షంగా జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. చాలాకాలంగా యూనియన్​లో తిష్టవేసిన నలుగురు లీడర్లే దీనికి కారణమంటున్నారు. కొంతమంది అసమ్మతివాదులకు పదవుల ఆశచూపి తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా చక్రం తిప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బైలాస్​కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని ఇటీవల కొందరు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లగా.. బైలాస్​ను పెద్దగా పట్టించుకోవద్దని, అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, కన్నెపల్లి యూనిట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం గమనార్హం. బెల్లంపల్లి యూనిట్ టీఎన్జీవోలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అక్కడ ఎన్నిక మాత్రం రద్దయింది. యూనిట్ల ఎన్నికలు పూర్తికాగానే జిల్లా కమిటీని సైతం ఏకగ్రీవంగా ఎన్నుకొని మమ అనిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మంచిర్యాలలో పోటాపోటీగా..

మంచిర్యాల యూనిట్ ఎన్నికలను సైతం ఏకగ్రీవంగా నిర్వహించడానికి టీఎన్జీవోస్ జిల్లా నాయకులు చేసిన ప్రయ్నతాలు విఫలమయ్యాయి. ప్రస్తుత కమిటీల పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంతమంది నాయకులు ముందుకు వచ్చారు. కానీ వారిని బుజ్జగించి, జిల్లా కమిటీలో పదవులు ఆశచూపి తమ ప్యానెల్లో కలుపుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ మంచిర్యాలలో ఏకగ్రీవానికి ఒప్పుకోకపోవడంతో మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ హాల్​లో ఎన్నికలు నిర్వహించారు.

మొత్తం 229 ఓట్లు పోల్ కాగా, అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న గోపాల్​కు 141 కోట్లు, మల్లేశ్​కు 84 ఓట్లు వచ్చాయి. అసమ్మతి వర్గాన్ని చీల్చడంతో ఎన్.గోపాల్ మరోసారి అధ్యక్షుడిగా గెలిచారు. ఉపాధ్యక్షుడిగా బి.ప్రకాశ్, సెక్రటరీగా టి.అజయ్ ప్రశాంత్, జాయింట్ సెక్రటరీగా బి.అరుణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.సందీప్, ట్రెజరర్​గా ఎన్.సతీష్కుమార్, పబ్లిసిటీ సెక్రటరీగా ఎంఏ.హఫీజ్, ఈసీ మెంబర్లుగా కె.ప్రవీణ్​కుమార్, వి.ప్రసన్న ఎన్నికయ్యారు. ఈ కమిటీ మూడేండ్లు పదవిలో కొనసాగనుంది.