- సమావేశాల్లో ఎన్నికల అధికారులు
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎన్నికల నిర్వహణపై విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరగనున్న ఎన్నికల ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు.
శనివారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు రాహుల్, సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీఓ రాములు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళతో కలిసి సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఏఎల్ఎంలు, ఐటీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు.
నోడల్ ఆఫీసర్ల పాత్ర కీలకం
నోడల్ అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థంగా చేపట్టాలని, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్‌జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ నిర్వహించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం దరఖాస్తులు సువిధలో 48 గంటల ముందుగా సమర్పించేలా అవగాహన కల్పించాలన్నారు.
ఏఆర్ఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లో అనుమతుల కోసం సింగిల్ విండో కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూంలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓలు రత్నకల్యాణి, కోమల్ రెడ్డి, నోడల్ అధికారులు విజయలక్ష్మి, గోవింద్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
యువత ఓటు నమోదు చేసుకోవాలి
యువత వంద శాతం ఓటు నమోదు చేసుకొని, లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్కమిటీ సభ్యులు కార్యాచరణ అమలు చేయాలని ఆదిలాబాద్ జిల్లాఎన్నికల అధికారి రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వీప్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కుపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, ఓటు ప్రాముఖ్యత తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని సూచించారు. డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, సూపరిడెంట్రాజేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.