కొనసాగుతున్న సెస్ పోలింగ్..పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

పోటీలో 75 మంది అభ్యర్థులు.. 26న కౌంటింగ్

పలుచోట్ల ప్రతిపక్ష నాయకుల ఆందోళనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :  సిరిసిల్ల  సహకార విద్యుత్ సరఫరా సంఘం ( సెస్ ) ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలోకి అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ తరచూ వస్తున్నాడని కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఈ విషయంపై పోలింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

మరోవైపు.. గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 

జాబితాలో పేర్లు లేవంటూ  ఆందోళన

ఓటరు జాబితాలో తమ పేర్లు లేవంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లు లేవంటూ సిరిసిల్లలోని సెస్ కార్యాలయానికి విచారణ కోసం వస్తున్నారు. జాబితాలో పేర్లు లేకపోవడంతో కొందరు సెస్ వినియోగదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

బ్యాలెట్ పేపర్ చించివేత.. కేసు నమోదు 

ముస్తాబాద్ మండలం పోతుగల్ సెస్ ఓటింగ్ సెంటర్ లో నరేష్ అనే వ్యక్తి.. తన ఓటు హక్కు వినియోగించుకోకుండా బ్యాలెట్ పేపర్ ను చింపివేయడంపై పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వంగపల్లి వెంకటేశ్ అనే వ్యక్తి.. ఓటు వేసేందుకు పోతుగల్ సెస్ పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అయితే.. పోలింగ్ కేంద్రంలో గుర్తులు సరిగా కనిపించకపోవడంతో.. తన వెనుకాలే ఉన్న కంచం నరేష్ అనే వ్యక్తిని అడిగాడు. దీంతో నరేష్ ఎన్నికల గుర్తు గురించి చెప్పడంతో అక్కడే ఉన్న ఏజెంట్ ఒకరు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కోపంతో తాను ఓటు వేయనంటూ పోలింగ్ అధికారులు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ ను నరేష్ చించి వేసి, నిరసన తెలిపాడు. పోలింగ్ అధికారుల ఫిర్యాదుతో నరేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

పోలింగ్ బూతుల పరిశీలన

సెస్ ఎన్నికల పోలింగులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఇటు వేములవాడ పట్టణంలో సెస్ ఎన్నికల పోలింగ్ బుతులను రాష్ట్ర కో ఆపరేటివ్ ఎన్నికల అథారిటీ ఆఫీసర్ సుమిత్ర, ఎన్నికల అధికారి మమత పరిశీలించారు. 

ఇవాళ ఉదయం 8 గంటలకు సెస్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెస్ పరిధిలో 87,130 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రెబెల్స్​ కలిపి 75 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 750 మంది ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 252 పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 255 పంచాయతీలు, 2 మున్సిపాల్టీలు, 4 నియోజకవర్గాల్లో 750 మంది సిబ్బందిని కేటాయించారు. బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కోసం 40 బస్సులను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రాష్ట్ర కో–ఆపరేటీవ్ ఎన్నికల అథారిటీ ఆఫీసర్​ సుమిత్ర, మమత, అడిషనల్​ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీవో పవన్ కుమార్, సెస్ ఎండీ రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు. సెస్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.

సెస్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1,100 మంది పోలీసులు విధుల్లో ఉంటారని జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే తెలిపారు. మొత్తం 38 రూట్స్ గా డివైడ్ చేశామని, రూట్ బందోబస్తులో ఒక ఏఎస్సై ఇన్​చార్జిగా ఉంటారన్నారు. పోలింగ్ ఏరియాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్​ రూమ్​కు బ్యాలెట్ బాక్స్ లను తరలిస్తారు. ఈ నెల 26న కౌంటింగ్ ఉంటుంది. 27న కొత్త డైరెక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.

జోరుగా ప్రచారం

సెస్ ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ అగ్ర నాయకులు సైతం ఈ ఎన్నికలపై ఫోకస్​ చేశారు. ఎన్నికల కోడ్​ లేకపోవడంతో గురు, శుక్రవారాల్లోనూ ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ సిరిసిల్లలో పర్యటించారు. అధికార పార్టీ అవినీతిపైనే బీజేపీ నేతలు ఫోకస్​ పెట్టారు. మండలాల వారీగా బీజేపీ సీనియర్లు ఇన్​చార్జీ లుగా ఉండి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచే శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్​ ద్వారా ఓటర్లతో మాట్లాడారు. ‘క్యాండెట్​ను కాదు.. నన్ను చూసి ఓటు వేయండి’ అని కోరారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు.