- అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు.. సర్వేలు ఉల్టాపల్టా
- హర్యానాలో 48 సీట్లతో మళ్లీ పవర్లోకి బీజేపీ
- 37 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్.. ఖాతా తెరవని ఆప్
- జమ్మూకాశ్మీర్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా
- 48 సీట్లలో కూటమి విజయం.. 29 సీట్లకు బీజేపీ, 3 సీట్లకు పీడీపీ పరిమితం
- 90 సీట్లకుగాను 48 సీట్లతో కమలం పార్టీ గెలుపు
హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుం దని, జమ్మూకాశ్మీర్ లో హంగ్ వస్తుందని సర్వే సంస్థలు అంచనా వేయగా.. రెండు చోట్లా తలకిందులైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర చరిత్రలోనే హ్యాట్రిక్ సాధించిన ఏకైక పార్టీగా అవతరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి సత్తా చాటింది. హర్యానా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల పోలింగ్ జరగగా.. మంగళవారం ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. హర్యానాలో తొలి రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగడంతో ఆ పార్టీ శ్రేణులు ముందస్తుగానే వేడుకలు మొదలుపెట్టాయి. కానీ క్రమంగా బీజేపీ పుంజుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 90 సీట్లకుగాను అధికార బీజేపీ 48 సీట్లను గెలుచుకుని మూడోసారి పవర్ ను నిలబెట్టుకుంది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో 90 సీట్లకుగాను నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 సీట్లతో కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కీలక పార్టీ అయిన పీడీపీ చతికిలపడింది.
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయాన్ని దక్కించుకుని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి హ్యాట్రిక్ విజయంతో కమలం పార్టీ సత్తా చాటింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగగా.. ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా బీజేపీ 48 సీట్లతో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైపోయింది. ఐఎన్ఎల్డీ 2 సీట్లను, ఇండిపెండెంట్లు 3 సీట్లను గెలుచుకున్నారు. మూడంచెల భద్రత మధ్య మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం ప్రారంభించింది. మొదట ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగింది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. తమ గెలుపు ఖాయమని భావించిన హస్తం పార్టీ క్యాడర్ ముందుగానే సంబరాలు మొదలుపెట్టింది. కానీ కొన్ని రౌండ్ల తర్వాత అనూహ్యంగా బీజేపీ పుంజుకుని ఆధిక్యంలోకి వచ్చింది. ఒక్కో చోట గెలుస్తూ మొత్తం 48 సీట్లను ఖాతాలో వేసుకుని కాంగ్రెస్కు షాకిచ్చింది. కాగా, 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చింది. 2019లో 40 సీట్లు మాత్రమే గెలిచినా, మిత్రపక్షం జేజేపీ (10 సీట్లు)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 39.94% ఓట్ షేర్ సాధించగా.. కాంగ్రెస్ కు 39.09% ఓట్లు పడ్డాయి.
హర్యానాలో ఇదే ఫస్ట్ హ్యాట్రిక్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి అధికారంలోకి రాలేదు. తొలిసారిగా బీజేపీ ఈ ఘనతను సాధించింది. 2014 నుంచి రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ సారి గద్దె దిగుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పాయి.
జాట్ ప్రాబల్య ప్రాంతాల్లో బీజేపీ హవా
జాట్ వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న 33 సీట్లలో బీజేపీ 17 సీట్లను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 14 సీట్లకే పరిమిత మైంది. ఎస్సీ ప్రాబల్యం ఉన్న 17 సీట్లలో 9 సీట్లలో బీజేపీ ఆధిక్యం చూపింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఆప్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. దీంతోపాటు జేఎన్జేపీ, ఐఎన్ఎల్డీ పార్టీల వోట్ షేర్ బాగా పడిపోవడం తో.. ఆ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మళ్లాయి.
హర్యానా
మొత్తం అసెంబ్లీ సీట్లు: 90
మ్యాజిక్ ఫిగర్: 46
బీజేపీ: 48
కాంగ్రెస్: 37
ఐఎన్ఎల్డీ: 2
ఇండిపెండెంట్లు: 3