యాదాద్రి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

యాదాద్రి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక రిటర్నింగ్ అధికారి వినయ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ పక్రియ ఉంటుందన్నారు. ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా రేపటి నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని టీమ్ లతో కలిసి కో ఆర్డినేషన్ చేసుకుంటూ పని చేస్తున్నామని చెప్పారు. 

ఈ నెల 4 వ తేదీ కంటే ముందు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మునుగోడు ఉప ఎన్నికలో ఓటు వేసే అవకాశం ఉంటుందని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంటుందని, అందుకే అదనపు టీమ్ లతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. నామినేషన్ నుంచి ఎన్నిక పూర్తై కౌంటింగ్ వరకూ  సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలతో ప్రతిదీ చిత్రీకరిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 2,2700 మంది ఓటర్లు ఉన్నారని, 298  పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రాజకీయ నాయకులు ఉప ఎన్నిక సందర్భంగా రూల్స్ బ్రేక్ చేస్తే.. ఫిర్యాదు చేసేందుకు  ప్రత్యేక యాప్ ను తయారు చేశామన్నారు.