- ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యేల పాట్లు
- చేసిన సాయం గుర్తు చేస్తూ ఫోన్లు
- షెడ్యూల్ రాకముందే జోరందుకున్న ప్రచారం
యాదాద్రి, వెలుగు : ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు.. ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించ లేదు.. కానీ, అధికార పార్టీలో మాత్రం అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. కోయిల ముందే కూసినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఓటర్లను ఆకట్టుకునే ఏ ఛాన్సూ వదులుకోవడం లేదు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందజేయడంతో పాటు యూత్‌ను టార్గెట్ చేసి ఉచితంగా లైసెన్స్‌లు అందిస్తున్నారు. వీటితో పాటు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్‌ట్రాన్స్‌ఫర్) కూడా మొదలు పెట్టేశారు.
హాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో...
గత రెండు పర్యాయాలు గెలుపొందిన యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రతీరోజూ తమ తమ నియోజవర్గాల్లోని కనీసం రెండు మండలాల్లో పర్యటిస్తున్నారు. ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి అవసరమైన పనులను మంజూరు చేయించుకొని శంకుస్థాపనలు చేస్తున్నారు. నెల రోజుల్లోనే భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో రూ.కోట్ల అభివృద్ధి పనులకు ఫౌండే షన్ వేశారు. కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి సంఘాలకు భవనాలను మంజూరు చేయించారు. పనులు పూర్తైన నిర్మాణాలను ప్రారంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 473 స్పోర్ట్ కిట్స్‌కు యూత్‌కు అందిస్తున్నారు.
ALSO READ : తెరపైకి బీసీ నినాదం.. 53 శాతం మంది బీసీ ఓటర్లే
ఎవరొచ్చినా కాదనట్లే..
గృహలక్ష్మి స్కీమ్‌లో లబ్ధిదారులుగా 21547 మందిని గుర్తించి 5930 మందిని మొదటి విడతలో ఎంపిక చేశారు. వీరికి ప్రొసిడింగ్ కాపీలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మిగిలిన లబ్ధిదారులు, తిరస్కరణకు గురైన వారు కూడా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతుండడంతో ఆఫీసర్లకు సిఫారసు చేస్తున్నారు. బీసీ బంధు కోసం 12928 మంది అప్లై చేసుకుంటే 600 మందిని ఎంపిక చేసి ప్రొసిడింగ్స్ ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి నెక్ట్స్ విడతలో ఇస్తామని హామీలు ఇస్తున్నారు.
దళితబంధు విషయంలోనూ ఇలాగే చేస్తున్నారు. తొలివిడతలో 413 మందికే ఇచ్చినా రెండో విడతలో 2200 మందికి ఇప్పిస్తామని, మిగిలిన వారికి విడతల వారీగా ఇస్తామని నచ్చజెబుతున్నారు. అంతేకాదు తొమ్మిదేండ్లుగా వివిధ స్కీమ్స్కింద లబ్ధిపొందిన వారి వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే. వారి నెంబర్లకు ఫోన్ చేయడంతో పాటు బీఆర్ఎస్ లీడర్లు నేరుగా వారిని కలుస్తూ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. స్కీమ్‌లతో పాటు యువ ఓటర్లకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఫ్రీగా లైసెన్స్‌లు ఇప్పిస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో 13,500 మంది, ఆలేరు నియోజకవర్గంలో 10 వేల మందికి పైగా ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్‌లకు అప్లై చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే దాదాపు 20 వేల మందికి లైసెన్స్‌లు అందించారు.
అప్పుడే డీబీటీ
గతంలో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ఓటర్లకు డీబీటీ (డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అసలేమీ మొదలు కాకుండా ఓటర్లకు నేరుగా డీబీటీ మొదలు పెట్టారు. ఇప్పటికే మహిళా సంఘాలకు సభ్యులకు డిమాండ్ బట్టి ఒక్కొక్కరికి రూ. 1000కిపైగా పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేల ప్రోగ్రామ్‌లకు జనం నుంచి బాగానే స్పందన వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే నామినేషన్లు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోని ప్రజలు చర్చించుకుంటున్నారు.