ఆసిఫాబాద్, వెలుగు: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్లు అజయ్ మిశ్రా, దీపక్ మిశ్రా సూచించారు. సోమవారం ఆసిఫాబాద్కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు రాహుల్ మహివాల్, పోలీసు పరిశీలకులు డీకే చౌదరి, ఎస్పీ సురేశ్ కుమార్ తో కలిసి ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని సిర్పూర్, అసిఫాబాద్ నియోజకవర్గాలల్లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 90 శాతం మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని.. 73,106 ఓటరు గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖ ద్వారా పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సిర్పూర్ లో 45, ఆసిఫాబాద్ లో 47 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు
ఆదిలాబాద్ టౌన్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో రాహుల్‌రాజ్ పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, బోథ్, ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారులు చాహత్ బాజ్ పాయ్, స్రవంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.