కన్ఫ్యూజ్​ చేస్తున్న ఎన్నికల సర్వేలు .. ఒక్కో సర్వే ఒక్కో లెక్క

హైదరాబాద్, వెలుగు:  ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పదుల సంఖ్యలో సర్వేలు పుట్టుకొస్తున్నాయి. ఒక్కో సర్వేలో ఒక్కోలా రిజల్ట్ వస్తున్నది. ఓ సర్వే ఓ పార్టీకి అనుకూలంగా, ఇంకో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా చెబుతున్నది. అసలు ఏ పార్టీకి మెజార్టీ రాదని, ఈసారి హంగ్ ఏర్పడుతుందని మరో సర్వే అంటున్నది. ఇట్ల సర్వే సంస్థలు వేర్వేరు ఫలితాలు ప్రకటిస్తూ, జనాన్ని గందగోళానికి గురి చేస్తున్నాయి. జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునేందుకు పార్టీలే సొంతంగా ఈ సర్వేలు చేయిస్తున్నాయని పొలిటికల్​సర్కిళ్లలో చర్చ నడుస్తున్నది. 

సర్వేలకు ఓట్లు రాల్తయా!

ఎన్నికల సర్వేలను తమకు అనుకూలంగా చేయించుకు న్నంత మాత్రాన.. ప్రజలు ఓట్లేస్తరా? అంటే పార్టీలు అదే నమ్ముతున్నాయి. ఎన్నో కొన్ని ఓట్లు తమవైపు టర్న్​అవుతాయని భావిస్తున్నాయి. పాజిటివ్ ​టాక్​ను పెంచితే ఓట్లు పడతాయని, పాజిటివ్​ టాక్​ను పెంచేందుకు సర్వేలు దోహదపడతాయని అనుకుంటున్నాయి. దీంతోనే హామీలతో పాటు సర్వేలూ కీలకమవుతాయన్న చర్చ పొలిటికల్​ సర్కిళ్లలో జరుగుతు న్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సర్వేలపై జనాల్లో చర్చ జరుగుతుందని sకొందరు నేతలు భావిస్తున్నారు.

ALS0 READ: ‘సీఎం బ్రేక్​ఫాస్ట్’ అమలుకు సొంత పైసలు పెట్టుకోవాల్సిందే!


ఆయా పార్టీలు ఎన్నికల వేళ ఇలాంటి సర్వేలను జనాల్లోకి వదిలి, తమవైపు పాజిటివ్ టాక్​తెచ్చుకునేలా మైండ్​గేమ్ ఆడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలు, తమ పార్టీ హామీలను జనాల్లోకి తీసుకెళ్లడం ఒక ఎత్తయితే.. సర్వేల పేరుతో జనాన్ని తమవైపు తిప్పుకోవడం మరో ఎత్తు అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. 

మొదట కాంగ్రెస్ కు ఫేవర్ గా.. 

కొద్ది రోజుల కింద లోక్​పోల్, పోల్​ట్రాకర్, జన్​మత్, తెలంగాణ పల్స్, ఏబీపీ సీ ఓటర్ వంటి సంస్థలు.. రాష్ట్రంలో టఫ్ ఫైట్ తప్పదని తమ సర్వేల్లో వెల్లడించాయి. అయితే  ఆయా సర్వేలన్నీ కాంగ్రెస్​వైపే మొగ్గు చూపుతూ ఫలితాలు ఇచ్చాయి. ఈ సర్వే ఫలితాలను ప్రత్యర్థి పార్టీలు తూర్పారబట్టాయి. అవన్నీ కాంగ్రెస్ చేయించిన ఫేక్​సర్వేలంటూ విమర్శలు గుప్పించాయి. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​ వంటి రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్​పోల్, పోల్​ట్రాకర్ వంటి సంస్థలు తమ సర్వేల్లో వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ద్వారా కాంగ్రెస్​పార్టీనే అనుకూల సర్వేలు చేయించుకుని ప్రజల్లోకి వదిలిందని ప్రత్యర్థి పార్టీల లీడర్లు విమర్శలు చేశారు. కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్​గా పని చేస్తున్న సునీల్​కనుగోలు కూడా కొన్ని సర్వే సంస్థల ద్వారా అనుకూల రిజల్ట్స్ ఇప్పించి, జనాల్లోకి వదులుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్​వినిపిస్తున్నది. 

కొద్ది రోజులకు బీఆర్ఎస్ కు అనుకూలంగా.. 

కాంగ్రెస్ పార్టీకి అనుకూల సర్వే ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే.. మరో రెండు సర్వేలు బీఆర్ఎస్​కు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. ఆ పార్టీకి 70 సీట్ల దాకా వస్తాయని ఇండియా టీవీ సర్వేలో తేలింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మిషన్​చాణక్య సర్వేలోనూ బీఆర్ఎస్​కు అనుకూల ఫలితాలొచ్చాయి. 44 శాతం మంది బీఆర్ఎస్​వైపే మొగ్గు చూపుతున్నారని ఆ సర్వేలో తేలినట్టు ఆ సంస్థ ప్రెస్​మీట్​పెట్టి మరీ ఫలితాలను రిలీజ్​ చేసింది. ఆ సర్వే రిపోర్టుల మీద కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అధికారం తమదంటే తమదేనంటూ ప్రకటనలు చేశాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇటీవల ఇండియా టుడే చేసిన సర్వేలో హంగ్ వస్తుందని తేలింది. అయితే, ఎక్కువ సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ సర్వే వెల్లడించింది.

ప్రీ పోల్​ సర్వేలపై ఆంక్షల్లేవ్.. 

నిజానికి ఎగ్జిట్​ పోల్స్​పై ఆంక్షలు పెట్టిన ఎన్నికల సంఘం.. ఈ ప్రీ పోల్​ సర్వేలపై మాత్రం ఆంక్షలు విధించలేదు. ఎన్నికలు జరగడానికి 48 గంటల ముందు నుంచి.. పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ ​పోల్స్​పై నిషేధం ఉన్నది. అందుకే అన్ని సర్వే సంస్థలు.. పోలింగ్​ అయిపోయిన మరుక్షణం పోలింగ్ ​ట్రెండ్​ను బట్టి ఎగ్జిట్​పోల్స్ విడుదల చేస్తాయి. అయితే, పోలింగ్​కు ముందు నిర్వహించే సర్వేలపై మాత్రం ఇలాంటి ఆంక్షలేవీ లేవు. ఆయా సర్వేలకు ఎన్నికల కోడ్​ కూడా అడ్డంకి కాదు. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు సొంతంగా సర్వేలు చేయించుకుంటూ అనుకూల ఫలితాలను పబ్లిష్​చేయించుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టి, గందరగోళంలో పడేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి ప్రీ పోల్​సర్వేలపైనా ఆంక్షలు పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.