
- ఇప్పటి నుంచే ప్రచారం షురూ
- అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ లో జోష్
- రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీలు
ఆదిలాబాద్, వెలుగు : ‘‘ అన్నా.. ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేద్దామనుకుంటున్న. నీ సపోర్ట్ కావాలి” ఏ ఊర్లో చూసినా ఇప్పుడు ఈ మాటలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, గ్రామ పంచాయితీ పాలకవర్గాల గడువు వచ్చే నెల అయిపోతుండడంతో గ్రామ స్థాయి నేతలంతా పంచాయితీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా అధికారులు ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నం కావడంతో స్థానిక నేతలు ప్రచారం షురూ చేస్తున్నారు. కొందరు తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లను కూడా ఎన్నికల క్యాంపెయిన్‌కు వాడుకుంటున్నారు. చిన్న ఫంక్షన్ అయినా ఆర్భాటంగా చేస్తూ ఊర్లో వారందరినీ ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో జోష్ కనిపిస్తోంది. అధికారానికి దూరమైన బీఆర్ఎస్ కూడా పంచాయితీల్లో పట్టు నిలుపుకునేందుకు గట్టిగా ప్రయత్నించనుంది. దీంతో పల్లెలకు మళ్లీ ఎన్నికల కళ రానుంది.
రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీలు
రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 2018 పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం గత పంచాయితీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. 2024 జనవరి 31తో ప్రస్తుత గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. వచ్చే మే లేదా జూన్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వరుసగా పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో ముందుగా పంచాయితీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సర్పంచుల పదవీకాలం జనవరి 31తో ముగుస్తున్నప్పటికీ మరో ఆరు నెలలు పొడిగించాలని వారు కోరుతున్నారు. 2019లో ఎన్నికలు నిర్వహించిన ఆరు నెలల తర్వాత సర్పంచులు, వార్డు సభ్యులకు చెక్ పవర్ ఆలస్యంగా ఇచ్చినందున ఆరు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సర్పంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు చాలా గ్రామాల్లో సర్పంచ్ లకు రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ బిల్లులు రావాల్సి ఉంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లకుపైనే బిల్లులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
రిజర్వేషన్లపైనే టెన్షన్..
గ్రామాల్లో రిజర్వేషన్లపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేదా కొత్త రిజర్వేషన్లు ప్రకటిస్తారనే దానిపై అయోమయం నెలకొంది. సర్పంచ్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న స్థానిక లీడర్లు రిజర్వేషన్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్ ఆశావాహులు సర్పంచ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టసవరణ చేసి రిజర్వేషన్లను పదేళ్లకు మార్చింది. అయితే రాష్ట్రంలో కొత్త సర్కారు రావడంతో అది మారుస్తారా లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తే ప్రస్తుతం ఉన్న సర్పంచులు చాలా మంది మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంతో 12,769 సీట్లలో సగం వారికే కేటాయించనున్నారు. అయితే, గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రావడంతో ఇప్పుడు గ్రామాల్లో సైతం తీవ్ర పోటీ నెలకొంది. గత పదేళ్ల కాలంలో 90 శాతం గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ లే ఉన్నారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో తమ పార్టీ బలోపేతమవుతోందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాక ముందే సర్పంచు ఎన్నికలు జనవరిలో వస్తున్నాయని ప్రచారం జరుగుతుండడంతో గ్రామాల్లో అప్పుడే మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బంది వివరాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టారు. గత ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించినట్లే ఈసారి కూడా అదే పద్ధతిలో జరిగే అవకాశం ఉంది.