- అప్లై చేసిన పేదల్లో ఉత్కంఠ
- లిస్టులో పేరు కోసం లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు
- ఇప్పటివరకు మంజూరైన డబుల్ ఇళ్లు 25,815
- గృహలక్ష్మి యూనిట్లు 39 వేలు
- పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తే 65 వేల మందికే లబ్ధి
- బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తున్న ఎమ్మెల్యేలు
కరీంనగర్, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో స్కీమ్‌ల అమలులో సర్కార్ వేగం పెంచింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ లకు అప్లై చేసుకున్న దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండింట్లో ఏదో ఒక స్కీమ్ లో పేరొచ్చినా సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాధాన్యమిస్తుండడంతో లిస్టులో తమ పేరు వచ్చేలా చూడాలంటూ లోకల్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 25,815 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా ఇందులో 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయి. వాటిల్లో 1600 కూడా పంచలేదు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం నత్తనడకన నడుస్తుండగానే.. ఈ స్కీమ్ పై చేతులెత్తేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు గృహలక్ష్మి స్కీమ్ ను తీసుకొచ్చింది. సొంత జాగల్లో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 39 వేల యూనిట్లను మంజూరు చేసింది. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు.. తాజాగా గృహలక్ష్మి స్కీమ్ కోసం కూడా అప్లై చేసుకున్నారు. రెండింట్లో ఏదో స్కీమ్ రాకపోతుందా అనే ధీమాతో వారున్నారు. ఈ రెండు స్కీమ్ లను పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 65 వేల మందికి సొంతింటి కల నెరవేరనుంది. కాగా అర్హులైన పేదలు లక్షల సంఖ్యలో ఉన్నారు.
గృహలక్ష్మి దరఖాస్తులు లక్ష
ప్రభుత్వం ఈ నెల 8, 9, 10 తేదీల్లో గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకునేందుకు అవకాశమివ్వగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 99,698 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో వీటి సంఖ్య లక్ష దాటింది. దరఖాస్తుల్లో అత్యధికంగా పెద్దపల్లి నియోజకవర్గంలో 14,758, హుజూరాబాద్ లో 13,437, వేములవాడలో 12,913 అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత సిరిసిల్లలో 9,979, జగిత్యాలలో 8,120, మంథనిలో 7,950, ధర్మపురిలో 7,308, రామగుండంలో 7,402, కోరుట్లలో 6,730, మానకొండూరులో 4,499, కరీంనగర్ లో 3,429, చొప్పదండిలో 3,176 అప్లికేషన్లు వచ్చాయి. విస్తృతంగా ప్రచారం చేసి అన్నిచోట్ల అప్లికేషన్లు తీసుకుని, మరో నాలుగైదు రోజులు గడువు ఇచ్చి ఉంటే మరో 2 లక్షల అప్లికేషన్ల వరకు వచ్చేవనే వాదన వినిపిస్తోంది. వచ్చిన అప్లికేషన్ల ఫీల్డ్ వెరిఫికేషన్ ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత అర్హులను సెలక్ట్ చేసి జాబితా రూపొందించనున్నారు. తొలివిడతలో నియోజకవర్గానికి 3 వేల మందికి తొలివిడత రూ.లక్ష అందజేస్తారు. వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను రిజర్వేషన్ ప్రాతిపదికన సెలక్ట్ చేయాల్సి ఉంటుంది.
డబుల్ ఇండ్లు దక్కేనా ?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25,815 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు సుమారు 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో లాటరీ ద్వారా సుమారు 2 వేల లోపే లబ్ధిదారులకు అందజేశారు. దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎవరికి ఇవ్వాలో అర్థంకాక మిగతా ఇళ్ల పంపిణీకి ఎమ్మెల్యేలు ఇన్నాళ్లు సాహసించలేదు. ఇప్పుడు గృహలక్ష్మి స్కీమ్ స్టార్ట్కావడంతో ఇళ్లు రానోళ్లకు ఈ స్కీములో పేర్లు పెట్టొచ్చనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. శాంక్షన్ అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోనూ మరో 7,513 ఇండ్ల నిర్మాణం ఇంకా స్టార్ట్ చేయలేదు. గృహలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసినందున ఈ ఇళ్లను నిర్మిస్తారా, లేదంటే ఈ స్కీమ్‌లోనే కలిపేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండ్ల కోసం ఆందోళనలు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీం ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. ఇళ్ల నిర్మాణం కొన్నిచోట్ల పూర్తయినా.. పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుదారులు తరుచూ ఆందోళనలకు దిగుతున్నారు. కరీంనగర్ శివారులోని చింతకుంట, తీగలగుట్టపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో చేరేందుకు మహిళలు పలుమార్లు యత్నించారు. కొందరైతే ఏకంగా ఫ్లాట్ల డోర్లకు తమ పేర్లు కూడా రాసుకున్నారు. ఆ ఇళ్లలోనే భోజనాలు చేశారు. పురుగుమందు డబ్బాలతో రావడంతో వారిని ఖాళీ చేయించడం పోలీసులకు
తలనొప్పిగా మారింది. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లోనూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చేవి.
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యాలే
మాకు ఉండడానికి ఇల్లు లేదు. కిరాయి ఇళ్లలో ఉంటూ కూలీ పని చేసుకుంటున్నాం. సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తమంటే మీ సేవ సెంటర్ లో ఏడేళ్ల కింద దరఖాస్తు పెట్టుకున్నం. ఇప్పటి వరకు మాకు ఇల్లు రాలే. మాకు ఎక్కడన్న గుడిసె వేసుకుందామంటే గుంట జాగ కూడా లేదు. అందుకే గృహలక్ష్మికి కూడా అప్లై చేసుకోలే. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లే ఇయ్యాలే.
కల్వ లత, చంద్రపురి కాలనీ, కరీంనగర్