సమస్యల సుడిగుండంలో  సూడాన్

సూడాన్ ని ఒమర్ అల్-బషీర్ దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించారనడం కన్నా దాన్ని ఆయన తన కబంధ హస్తాల్లో ఉంచుకున్నారనడం సముచితంగా ఉంటుంది. బషీర్ కు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమంతో ఆయన 2019 ఏప్రిల్ లో పదవీచ్యుతులయ్యారు. అది సూడాన్ ప్రజాస్వామిక దేశంగా రూపాంతరం చెందడానికి నాంది పలికింది. సైనికాధికారులు, పౌర ఉద్యమ నేతలు 2019 ఆగస్టులో  ఒక అవగాహనకు వచ్చి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు సావరిన్ కౌన్సిల్ పేరుతో ఒక పాలక మండలిగా ఏర్పడ్డారు. అన్నీ సవ్యంగా సాగుంటే ఈ సార్వభౌమాధికార మండలి చలవతో ఈ ఏడాది చివర్లో సూడాన్ లో ఎన్నికలు జరగవలసి ఉంది. 

వ్యవహారం ఎక్కడ బెడిసింది?

సైన్యానికి, పౌర ఉద్యమనేతలకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తాత్కాలిక ప్రధాన మంత్రి దైనందిన పాలనా వ్యవహారాలు చూస్తారు. సైనిక ప్రధానాధికారి రెండేళ్ళపాటు సావరిన్ కౌన్సిల్ కు నాయకుడుగా ఉంటారు. సైనిక ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ అబ్దెల్ ఫతా అల్-బుర్హాన్ అలా తాత్కాలిక ప్రభుత్వ నాయకత్వాన్ని మరి కొద్ది వారాల్లో పౌర నాయకత్వానికి అప్పగించవలసి ఉంది. కానీ, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి తనను తాను నూతన నాయకునిగా ప్రకటించుకున్నారు. ఆయన అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రధాన మంత్రి అబ్దల్లా హమ్ దోక్ తో సహా పౌర నాయకులను జైలులో పెట్టారు. సూడాన్ సైన్యం అలా సావరిన్ కౌన్సిల్ ను రద్దు చేయడంతో దేశం మళ్ళీ కల్లోల పరిస్థితుల్లోకి జారుకుంది.  ఇటీవల రేగిన ఘర్షణలు, దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగా చనిపోయారు. బుర్హాన్ కు విధేయులైన సైనికులు, జనరల్ మహమ్మద్ హమ్దాన్ డగాలోకి మద్దతుదారులైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్.ఎస్.ఎఫ్) సభ్యులకు మధ్య అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో పోరాటం సాగుతోంది. ఈ రెండు దళాలవారు కలసి గతంలో 2019లో  ఒమర్ హసన్ అల్-బషీర్ ను పదవీచ్యుతుడిని చేశారు. నిజానికి, సైన్యం పాత్ర చాలా వరకు లాంఛనప్రాయమైనదిగానే ఉండాలి. కానీ, విదేశాంగ విధానం, శాంతి చర్చల విషయాల్లో సైన్యం తరచు తన పరిధిని అతిక్రమిస్తూ వచ్చిందని పౌర నాయకులు వాపోతున్నారు. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ పేరుతో ఉన్న పారామిలటరీ దళాలను సైన్యంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కూడా సైనికాధికారులు ప్రతిఘటిస్తున్నారు. పేలుళ్ళు, కాల్పులు, ఫిరంగుల మోతలతో సూడాన్ యుద్ధ రంగాన్ని తలపిస్తోందని అక్కడి నుంచి వస్తున్న వార్తలు సూచిస్తున్నాయి. 

ఇరుగు పొరుగుతోనూ సంకటం

సూడాన్ కు పొరుగునున్న ఇథియోపియా, చాద్, సౌత్ సూడాన్ లలో కూడా పరిస్థితులు సవ్యంగా లేవు. అడపాదడపా రాజకీయంగా సంక్షుభిత పరిస్థితులు, ఘర్షణలను చవిచూస్తున్నాయి. ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతంలో పరిస్థితులు సరిగ్గా లేక వేలాది మంది సూడాన్ తూర్పు ప్రాంతంలోకి వలసవచ్చేశారు. ఇది సరిహద్దులోని వివాదాస్పద వ్యవసాయ భూముల్లో సైనిక ఉద్రిక్తతలకు కారణమవుతోంది. సూడాన్ సరిహద్దుకు సమీపంలో ఇథియోపియా ఒక జల విద్యుచ్ఛక్తి ఉత్పాదన ప్రాజెక్టును చేపట్టింది. దానిపై సూడాన్ తో చర్చలు మధ్యలో నిలిచిపోయినా ఇథియోపియా తనవంతు పనులు చేసుకుపోతోంది. దానివల్ల తాము భవిష్యత్తులో నీటి కొరతను ఎదుర్కోవలసి రావచ్చని సూడాన్ ఆందోళన చెందుతోంది. వాస్తవానికి,  నైలు నదిపై నిర్మిస్తున్న ఈ గ్రాండ్ ఇథియోపియన్ రినైజెన్స్ డ్యామ్ వల్ల దీర్ఘ కాలంలో సూడాన్ కు కూడా మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణలో రెండు దేశాలు సహకరించుకుంటే సూడాన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వ్యవసాయ, విద్యుచ్ఛక్తి రంగాలు మెరుగుపడతాయి.

ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం

సహజంగా ఈ కల్లోల పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.  సూడాన్ కరెన్సీ పౌండ్ విలువ అడంగుకు చేరుకుంది. ఇంచుమించుగా మన 14 పైసలకు ఒక సూడానీస్ పౌండ్ లభించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సూడాన్ లో  తరచూ నిత్యావసర వస్తువులు, విద్యుత్, ఇంధన కొరతలు సాధారణంగా మారాయి. రుణాల చెల్లింపులో వెసులుబాటు కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) పెట్టిన కఠినమైన షరతులకు తాత్కాలిక ప్రభుత్వం తలొగ్గింది. త్వరితగతిన అమలుపరచని సంస్కరణలతో ద్రవ్యోల్బణం 400 శాతం పైగా పెరిగిపోయింది. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా సైన్యం తన పబ్బం గడుపుకుంటోంది. ఉదాహరణకు, సైన్యం సహాయంతో ఒక గిరిజన తెగ పోర్ట్ సూడాన్ రేవును దిగ్బంధించింది.

శాంతి ప్రయత్నాలు

వైషమ్యాలకు సూడాన్ లో అన్ని వర్గాలవారు తక్షణం స్వస్తి పలకాలని ఐక్య రాజ్య సమితితో సహా అమెరికా, చైనా, రష్యా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్లు విజ్ఞప్తి చేశాయి. పోరాట వర్గాల మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి ఈజిప్టు, సౌత్ సూడాన్ లు ముందుకు వచ్చాయి. జైలులో పెట్టిన నాయకులను విడుదల చేయడం ద్వారా బుర్హాన్ చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. దేశ రక్షణ సైన్యం బాధ్యత కావాలిగానీ, పరిపాలన కాదు. ఆ పని ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు చూసుకుంటారు. 

భారతీయుల సంగతేంటి?

ఇతర దేశాల్లో మాదిరిగానే సూడాన్ లో కూడా కొందరు భారతీయులున్నారు. ఉద్యోగనిమిత్తం సూడాన్ వెళ్ళిన భారతీయ మాజీ సైనికోద్యోగి ఒకరు తాజా ఘర్షణల్లో బులెట్ తగిలి చనిపోయారు. పరిస్థితులు కొద్దిగానైనా కుదుటపడితేగానీ, ఎవరెవరు ఎంత మంది అసువులు బాసిందీ బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం దాదాపు నాలుగువేల మంది భారతీయులు సూడాన్ లో ఉన్నట్లు అధికారిక సమాచారం. వారిలో కొన్ని దశాబ్దాల క్రితమే సూడాన్ వెళ్ళి స్థిరపడినవారు సుమారు 1200 మంది ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ళ నుంచి బయటకు రావద్దని సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు విజ్ఞప్తి చేసింది.  కర్ణాటకకు చెందిన హక్కి పిక్కి తెగకు చెందిన 31 మంది గిరిజనులు ప్రస్తుతం సూడాన్ లో చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి కేంద్రం కృషి చేయాలని కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు. 

‘‘అధికారం తాత్కాలికం. కుర్చీ రావచ్చు, పోవచ్చు కానీ ప్రజాస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కొన్ని సవరణలు ఉండొచ్చు గానీ రాజ్యాంగం ఎప్పటికీ కొనసాగుతుంది. రాజ్యాంగాన్ని బుల్‌‌డోజర్‌‌తో ధ్వంసం చేయడం సాధ్యం కాదు. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవదు’’

–  మమతా బెనర్జీ,  పశ్చిమ బెంగాల్ ​సీఎం

‘‘కర్నాటక భవిష్యత్తుపై బీజేపీ దృష్టి సారించింది. అందుకే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 74 మంది కొత్తవారిని ఎంచుకుంది. టిక్కెట్​రాలేదని ఒకరు ఇద్దరు తమ మనుసు చంపుకొని కాంగ్రెస్‌‌లో చేరారు. అది వాళ్లు చేసిన పెద్ద పొరపాటు’’
– రాజీవ్​చంద్రశేఖర్,  కేంద్ర మంత్రి 

‘‘కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. ఎన్నికల్లో మేము కులాల ప్రాతిపదికన ఓట్లు అడగడం లేదు. లింగాయత్‌‌లు, వొక్కలిగలు సహా అన్ని వర్గాల ఓట్లను మేము ఆశిస్తున్నాం. సీఎం ఎవరనేది పార్టీ డిసైడ్​చేస్తుంది’’
– సిద్ధరామయ్య, కర్నాటక మాజీ సీఎం

 మల్లంపల్లి ధూర్జటి,