రామగుండం విలీన గ్రామాల్లో .. ఎలక్షన్లు ఉంటయా.. ఉండయా?

  • బల్దియాలో కలిసిన 4 గ్రామాల్లో గతంలో ఎన్నికలు జరగలే
  • అసెంబ్లీ తీర్మానం చేస్తేనే ఆ ఊళ్లలో ఎన్నికలు
  • పంచాయతీ ఎన్నికల ఏర్పాటులో ఆఫీసర్లు 

పెద్దపల్లి, వెలుగు: రామగుండం బల్దియాలో విలీనమైన కొన్ని గ్రామాల్లో ఈ సారి కూడా ఎలక్షన్లు జరిగేలా లేవు. రామగుండం, రామగిరి​, అంతర్గాం మండలాల్లోని కుందనపల్లి, లింగాపూర్​, వెంకట్రావుపల్లి గ్రామాలతోపాటు ఎల్కలపల్లి జీపీలోని రెండు వార్డులు ఐదేళ్ల కింద రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిపారు. ఆ టైంలో బల్దియాలో కలుపొద్దని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. అయినా సర్కార్​ పట్టించుకోకుండా మున్సిపల్​ఎన్నికలు నిర్వహించడంతో ఆయా గ్రామాల ప్రజలు బహిష్కరించారు. అనంతరం 2019లో పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగగా ఈ నాలుగు గ్రామాలకు నిర్వహించలేదు. దీంతో మున్సిపాలిటీలో కలపడాన్ని వ్యతిరేకించిన గ్రామాలు, వార్డులకు స్పెషల్​ ఆఫీసర్లను నియమించి ప్రభుత్వం పాలన సాగించింది. ప్రస్తుతం జీపీ ఎన్నికలకు సర్కార్​ సిద్ధమవుతుండగా తమ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయో లేదోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 

అభివృద్ధికి దూరం..

2019లో సర్కార్ ​పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఆ టైంలో రామగుండంలో విలీన పంచాయతీలైన కుందనపల్లి, లింగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిలో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఈ ఐదేళ్లు ఈ గ్రామాలు స్పెషల్​ఆఫీసర్ ​పాలనలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. 2018 పంచాయతీరాజ్​చట్టం ప్రకారం 10 ఏండ్లపాటు ఒకే రిజర్వేషన్​అమలు చేయాలి. ఈక్రమంలో ఈ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీ తీర్మానం చేయాల్సి ఉంది.  కొత్తగా ప్రభుత్వం కొలువుదీరగా ఎన్నికల్లోపు తీర్మానం చేయడం సాధ్యమవుతుందా అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 

ఎన్నికల ఏర్పాట్లలో ఆఫీసర్లు...

జనవరి 31, 2024 నాటికి ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం తీరిపోతుంది. దీంతో రాష్ట్రంలో జీపీ ఎన్నికలకు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల 
వివరాలు పంపాలని అధికారులకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. కాగా కొన్ని పంచాయతీలు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. సుల్తానాబాద్​ మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు విలీనమయ్యాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో కలిపి మొత్తం 263 పంచాయతీలు, 2436 వార్డులకు ఎన్నికలు జరిగాయి.  ప్రస్తుతం 263 పంచాయతీలతోపాటు నాలుగు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

మా గ్రామంలోఎలక్షన్​ పెట్టాలే

మా గ్రామం ఐదేళ్లుగా స్పెషల్​ఆఫీసర్​ పాలనలో ఉండడంతో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఎన్టీపీసీ బూడిదతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాలకవర్గం లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావట్లేదు. రానున్న రోజుల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మా ఊళ్లోనూ ఎన్నికలు పెట్టాలే.

 శ్రీనివాస్​, గ్రామస్తుడు, కుందనపల్లి