ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..కరీంనగర్‌‌లో 5 గంటల వరకు 67 శాతం దాటిన ఓటింగ్

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..కరీంనగర్‌‌లో 5 గంటల వరకు 67 శాతం దాటిన ఓటింగ్
  •     2019తో పోలిస్తే మరో 4 శాతం పెరిగే చాన్స్
  •     పెద్దపల్లిలో 67.80శాతం 

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం, స్వల్ప వివాదాలు మినహా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం వాతావరణం చల్లబడడంతో  ఉదయాన్నే చాలా మంది ఓటేసేందుకు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ 10.01 శాతం నమోదు కాగా, సాయంత్రం 5 గంటలకు 67.67 శాతం నమోదైంది. 6 గంటల వరకు 72 శాతం వరకు ఓటింగ్ జరగొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. 2019 ఎన్నికల్లో మొత్తం 14,96,211 మంది ఓటర్లకుగాను, 10,94,551 ఓట్లు(69.52 శాతం) పోలయ్యాయి.

గత ఎన్నికలతో పోలిస్తే  ఈ సారి పోలింగ్ శాతం కచ్చితంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 73.63 శాతం ఓటింగ్ నమోదవగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 55.82 శాతం నమోదు కావడం గమనార్హం. గన్నేరువరం మండలకేంద్రంలో కొలుపుల వేణు అనే వ్యక్తి తన ఓటు గల్లంతయిందని ఆరోపించాడు. గంటల తరబడి ఓటు కోసం వెయిట్ చేశాక తీరా ఓటర్ యాప్ లో చెక్ చేస్తే మైలారం గ్రామంలో అతని ఓటు 
కనిపించింది. 

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..

కరీంనగర్ లోక్ సభ పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గన్నేరువరం మండల కేంద్రంలోని హైస్కూల్ లో ఏర్పాటు చేసిన 182 పోలింగ్ కేంద్రంలో, గన్నేరువరం బూత్ నెంబర్ 190లో, ఇదే మండలం కాసింపేటలోని బూత్ నంబర్ 208లో ఈవీఎంలు మొరాయించాయి. కాసింపేటలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

మరో ఈవీఎంను ఏర్పాటు చేయడానికి చేయడానికి 2 గంటలు పట్టడడంతో ఉక్కపోతతో ఓటర్లు  ఇబ్బందిపడ్డారు. శంకరపట్నం మండలం మొలంగూరులో ఈవీఎం మొరాయించడంతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. చొప్పదండి మండలం రాగంపేట 123 పోలింగ్ కేంద్రంలో వీవీ ప్యాట్‌ ఎర్రర్ కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. 

జగిత్యాలలో ఆలస్యంగా ప్రారంభం 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల, మల్లాపూర్, రాయికల్ మండలాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆలస్యంగా మొదలైంది. ఎన్నికల ప్రక్రియను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యవేక్షించారు.  సాయంత్రం 7 గంటల వరకు కోరుట్లలో 73.85 శాతం నమోదు కాగా, జగిత్యాలలో  73. 65 శాతం, ధర్మపురిలో 77. 34 శాతం ఓట్లు పోలైయ్యాయి. మొత్తంగా 73. 62 శాతం ఓట్లు పోలైనట్లు ఎలక్షన్ ఆఫీసర్లు తెలిపారు. రాయికల్​ మండలం మైతాపూర్​ గ్రామంలో ఈవీఎం మొరాయించింది.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

భీమారం మండలం గోవిందారం గ్రామానికి చెందిన కారోబార్ పోలింగ్ స్టేషన్ వద్ద ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. కథలాపూర్ మండలం చింతకుంటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మద్య ఘర్షణ జరిగింది. బీజేపీకి ఓటేయాలని చెప్పినందుకు నేతుల‌ మల్లేశం అనే వ్యక్తిపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. 

పెద్దపల్లిలో 67.80 శాతం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నెల రోజులుగా సాగిన హడావిడికి తెరపడింది. అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంల రూపంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.  సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​ మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీడుగా సాగింది. ఎండ లేకపోవడంతో ఓటర్లు పోలింగ్​ స్టేషన్ల వద్ద బారులుదీరారు. మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి

 చెన్నూర్​ నియోజకవర్గాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఈసీ 4 గంటల వరకే నిలిపివేశారు.  మిగిలిన మూడు నియోజకవర్గాలు పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ కొనసాగింది. మొత్తంగా పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో 67.80 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.