ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రా ప్రాంతంతో పోలిస్తే.. తెలంగాణలో అంత ఖరీదైన ఎన్నికలేమీ జరిగేవి కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణలో ఎన్నిక ఏదైనా అత్యంత ఖరీదు మరి! ఎందుకు ఎన్నికలు ఖరీదైనవిగా మారిపోయాయి? అలా ఎవరు మార్చారు? తెలంగాణ సమాజానికి ఇప్పటికే అర్థమయ్యే ఉంటది. ప్రత్యర్థులను ఓడించే కంటే ప్రజలను ఓడించడానికే ఎన్నికలను ‘కాస్ట్లీ’ గా మార్చేశారు! అందుకే, రాజకీయాల్లో ప్రజలను ఓడించే విద్య నేర్చుకోవాలంటే తెలంగాణకు వచ్చి నేర్చుకోవాల్సిందేనేమో! చిన్నపాటి ఎన్నికనూ పెద్ద ఎన్నికగా మార్చేశారు పాలకులు.
నిర్బంధ గెలుపులు
మొన్న జరిగిన సిరిసిల్ల సెస్ఎన్నికలే చిన్న ఉదాహరణ. అవి చిన్నపాటి ఎన్నికలు. అందులో ఓడినా, గెలిచినా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయినా తెలంగాణలో అధికారపార్టీ వార్డు మెంబర్ఎన్నికను కూడా సీరియస్‌గానే తీసుకుంటది! సెస్ఎన్నికలను వదిలేస్తుందని ఎందుకు అనుకుంటాం. ఒక స్థానంలో 7 ఓట్ల తేడాతో ఓడిన అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి, అర్ధరాత్రి లోకం నిద్రపోయాక తిరిగి గెలిచారు. గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. మరో స్థానంలో18 ఓట్ల తేడాతో ఓడిపోయిన అధికారపార్టీ అభ్యర్థిని అర్థరాత్రి దాటాక గెలిచినట్లు ప్రకటించారు. ఇవన్నీ దేనికి సంకేతం? ఓట్ల లెక్కింపు నిర్బంధాల మధ్య కొనసాగాలా?15 స్థానాలు గెలిచి క్లీన్‌స్వీప్ చేసే కిరీటం కోసం ఎన్ని అక్రమ మార్గాలైనా ఎంచుకోవడానికి వెనుకాడని తీరు కాదా ఇది! అంతెందుకు మునుగోడు ఉప ఎన్నిక ఎవరు జరిపారు? ఈసీనా? అధికార పార్టీనా? అనేది కూడా మరో తాజా ఉదాహరణే. సాంకేతికంగా ఈసీ జరిపింది నిజమే. కానీ ఒక అభ్యర్థికి కేటాయించిన గుర్తునే మార్పించడం ఎవరికి సాధ్యమో తెలియదా? ఆ అధికారిపై చర్యలు తీసుకొని ఉండొచ్చు. అంతటి ఉల్లంఘనను ప్రోత్సహించిన వారి బరితెగింపునే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రజలను ఓడించడానికి ఎంతటి ఉల్లంఘనలకైనా సిద్ధమే అనే సందేశమది! ప్రతిపక్షాల నగదు తరలింపును పోలీసులు పసిగట్టగలరు. కానీ అధికారపార్టీ నగదు తరలింపులను మాత్రం పసిగట్టలేరు. కంచే చేను మేసినట్లు పోలీసులే తరలింపు సేవలందించారని ప్రతిపక్షాల ఆరోపణ. 25 రోజులు ప్రభుత్వమే మునుగోడులో తిష్ట వేసింది. పోలింగ్‌రోజు అధికారపార్టీ రోడ్లపై నిలబడి డబ్బులు పంచుతుంటే అడిగేవాడు లేడు? అబ్జర్వర్లు ఎక్కడున్నారో తెలియదు, ఎన్ని ఉల్లంఘనలు? అందుకే తెలంగాణలో ఎన్నిక ఏదైనా ఖరీదుగానే మారింది.
ప్రజలను ఓడిస్తున్నారు
ఒక రాజకీయపార్టీ తాను బలపరిచిన వార్డు మెంబరు స్థానం ఓడినా, రాష్ట్రాన్ని ఓడినంత ఫీలింగ్‌లో బతకడమే ఒక పెద్ద ఓటమి. ఆ ఫీలింగే ఉల్లంఘనలకు ఉసిగొల్పుతున్నది. అదొక మానసిక బలహీనత. కుటుంబ పార్టీలకు ఉండే సహజ లక్షణం అది. అందునా ఉద్యమపార్టీగా ప్రస్థానం ప్రారంభించి, తదుపరి స్వయం ప్రకటిత ఫక్తు రాజకీయ పార్టీగా మారి, ఆ తదుపరి కుటుంబపార్టీగా అవతరించిన పార్టీ అది. ఇప్పుడది పేరు మార్చుకున్న పార్టీ కూడా. ఇన్ని అవతారాలు మార్చుకున్న పార్టీ బహుశా దేశంలో మరొకటి ఉండి ఉండదు. ప్రజలను ఓడించడానికి ఎన్ని అవతారాలైనా ఎత్తగలరు! ప్రజలను ఓడించే దాకా వాళ్లకు నిద్రపట్టదు. వారి పొలిటికల్ సైకాలజీ అలా ఎందుకు ఫిక్స్ అయిపోయింది? ప్రజల పట్ల వారికే విశ్వాసం లేకపోవడమే కదా! కరెన్సీకైనా, పవర్కైనా పని చెప్పాలి లేదా కన్ఫ్యూజన్అయినా సృష్టించాలి, అలా ప్రజలను ఓడించడం చాలా సులభం అనే ధీమా! సెస్ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే పాలకుడి కిరీటం ఏమీ పడిపోయేది కాదు కదా? ప్రజలను ఓడించడానికి వారికి ఎందుకు అంత కసి? తాము ఓడామనే పేరు ఎక్కడా వినిపించకూడదు, కనిపించకూడదు. చిన్న ఓటమి సైతం అధికార పీఠానికి ప్రమాదంగా భావించడమే ఒక పెద్ద ఓటమి! పీఠం కదిలితే తమ చిరునామే గల్లంతు అనే భయం వారిని నిరంతరం వెంటాడుతుంటది! సహజంగా ప్రజలు పార్టీలను ఓడిస్తుంటారు, గెలిపిస్తుంటారు. కానీ తెలంగాణలో పాలకుడే ప్రజలను ఓడిస్తుంటాడు! ప్రజలపై విశ్వాసం లేని నాయకుడు ప్రజలను నిరంతరం ఓడిస్తూనే ఉంటాడు.
పరాయిలను బతికిస్తూ..
ఆనాడు స్వయం పాలన అంటే ప్రజల స్వయం పాలన అనుకున్నారంతా. అది కేసీఆర్ స్వయంపాలన అయిపోతదని ఎవరూ కలగనలేదు. కనీసం వచ్చిన తెలంగాణకు సార్థకత లేదు సరికదా, తెలంగాణోడికి పాలకుడి దర్శనమే కరువాయె! ప్రగతి భవన్లో ఆంధ్రోళ్లకు వీఐపీ దర్శనాలు! ప్రగతి భవన్గేటు ముందు తెలంగాణోడి చేతిలో పెట్రోలు డబ్బాలు! రోజా ఇంట్లో రొయ్యల పులుసు తాగి రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నరు! కృష్ణా నీళ్ల వాటాను గాలికి వదిలేశారు! సెక్రటేరియట్ లో తెలంగాణ ‘ఆనిగెపు కాయ’ అధికారులేరి? ఆంధ్రా ‘సొరకాయ’ అధికారులే రాజ్యమేలుతున్నారెందుకు? ‘ఆంధ్రా మెఘా’ కాంట్రాక్టర్మిలియనీర్అయ్యాడే తప్ప ఒక్క తెలంగాణోడైనా బడా కాంట్రాక్టర్‌గా మారాడా? తెలంగాణ వచ్చిందంటే అనేక రంగాల్లో తెలంగాణ ఎదిగి వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ జరిగిందేమిటి? ముఖ్యమంత్రి కుర్చీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల కుర్చీలు తప్ప కేసీఆర్‌పాలనలో ఎదిగివచ్చిందేమైనా ఉందా? ఏ విధంగా చూసినా కేసీఆర్ తెలంగాణను ఓడిస్తూ రాజ్యమేలుతున్న మాట నిజం. ఇప్పుడు తెలంగాణ తనను గెలిపించే వారి కోసం ఎదురుచూస్తున్నది. ఇవాళ తెలంగాణ ఓడించబడ్డ కసితో ఉన్నది. తనను గెలిపించగలిగే వారి కోసం ఎదురుచూస్తున్నది. ఆ విశ్వాసం ఎవరు కల్పిస్తారు? అది ఏ పార్టీ కల్పిస్తుంది? అనేది ఆయా పార్టీల పోరాట పటిమ ద్వారానే తేలాల్సిన విషయం. సమయంలేదు మిత్రమా! అన్నట్లు.. తెలంగాణను గెలిపించేవాళ్లు సంసిద్ధం కాకపోతే మరోసారి ఏమౌతుందనే ఆందోళన తెలంగాణ ఆత్మకు తప్పదు. 2014లో సెంటిమెంటు పనిచేసింది. 2018లో ఖరీదైనా ఎన్నికలు గెలిపించాయి. ఇప్పుడు 2023లో కన్ఫ్యూజ్ చేసి గెలవాలనుకుంటున్నారు. కేసీఆర్ కన్ఫ్యూజన్ గేమ్‌ను ఛేదించే వాళ్లు కావాలె. క్లారిటీ రాజకీయం కావాలె. 2023 నూతన సంవత్సరంలో, తనను గెలిపించే వారి కోసం తెలంగాణ నిస్సందేహంగా ఎదురు చూస్తుందనడంలో సందేహమే లేదు.
పాలకుడికి కష్టమొస్తే.. ప్రజాస్వామ్యం గుర్తొస్తది!
తొమ్మిదేండ్లుగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాకి ఎత్తుకు పోయింది! మద్యం కేసు భయాలు, ఫాంహౌస్ ఎపిసోడ్ వంటి కష్టాల కడలి రాగానే మళ్లీ ప్రజాస్వామ్యం గుర్తొస్తున్నది. మేధావులు మౌనం వీడాలంటూ పిలుపులు వినిపిస్తున్నాయి. కవులు, కళాకారులు గళం విప్పాలని సందేశాలొస్తున్నాయి. సిరిసిల్ల సెస్ఎన్నికల కౌంటింగ్సెంటర్లో, మునుగోడులో ప్రజలను ఓడించింది ఏ ప్రజాస్వామ్యమో తెలియదు మరి! మేధావుల గళాలకు ఇంతకాలం తాళం వేయడమో, తాయిలాలతో జోకొట్టడమో చేసిందెవరో తెలియదా! ప్రజాస్వామ్యం తమకోసం తప్ప ప్రజల కోసం కాదంటారేమో? అన్ని వ్యవస్థలను వశపర్చుకొని పాలనను ఒంటి స్తంభం మేడలా మార్చుకున్న పాలకుడి నుంచి ఇవాళ పేద అరుపులు ఎందుకు వస్తున్నాయి?
సంక్షేమంలోనూ ఓడిస్తూ..
విద్యా, వైద్యాన్ని ఇప్పటికే ఓడించారు. ఫీజురియింబర్స్‌మెంట్ ను, ఆరోగ్యశ్రీని ఓడించి.. ఓట్ల పంటలకు కల్యాణలక్ష్మీలు, కండ్లద్దాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులనే ఫర్టిలైజర్‌గా మార్చుకొని పిండించుకోమరిగారు. ఒక ఇంట్లో రూ.2016 పెన్షన్ ఇచ్చి, అదే ఇంట్లో రూ. 3000 లిక్కర్తాగించి వసూలు చేస్తున్నారు. ఒకవైపు రైతుబంధు ఇస్తూ , మరోవైపు పంటల బీమాకు ఎగనామం, అన్నిసబ్సిడీలకు పంగనామాలు పెట్టడంతో పొలం దున్నుకొని బతుకుతున్న పట్టాదార్లు ఏడుస్తున్నరు. ఇంకోవైపు పడావు భూముల పట్టాదార్లు రైతుబంధుతో మురిసిపోతున్నరు. అదొక వావి వరుసలేని రైతుబంధు. బతికున్న రైతుకు పంటల బీమా ఇవ్వరు! చనిపోతే మాత్రం రైతుబీమా ఇస్తారు! ఆ విధంగా ఇప్పటికే తెలంగాణ రైతును నిలువునా ఓడించారు. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ ఓడించబడుతూనే వస్తున్నది. పాలకుడు మాత్రమే గెలుస్తూ వస్తున్నాడు.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్