ఎన్నికలు మిగిల్చేది ఎండమావులనే!

ఎన్నికలు మిగిల్చేది ఎండమావులనే!

ఎన్నికల్లో ఓటర్లు పార్టీలను మార్చి, అభ్యర్థులను మార్చి తమ ప్రతినిధులను ఎంపిక చేసుకుంటున్నా.. ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పేదీ రావడం లేదు.  ఏ రాజకీయ పక్షాన్ని నమ్ముకున్నా దేశాన్ని  సమస్యల నుంచి, సామాన్యులని  కష్టాల నుంచి గట్టెక్కించే శక్తి సామర్థ్యాలు ఆ పార్టీలకు ఉండడం లేదు.  ప్రజలను  బాగుపరచాలని చిత్తశుద్ధితో ఆలోచించే పార్టీలు అసలు దేశంలో ఉన్నాయా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ పార్టీ అధినాయకులకు ఆ సంకల్పమున్నా అనుయాయులు మద్దతుగా నిలుస్తారా అనేది మరో చిక్కు.  ఎన్నికలంటేనే  కోట్ల ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ఆదాయ మార్గాలను వెదుక్కునే తమవారిని అడ్డుకునే పరిస్థితి పార్టీ పెద్దలకు ఉండట్లేదు.

రా జకీయాల్లో ఉండేవారంతా  రెండు, మూడు కూటములుగా విడిపోయినట్లు అనిపిస్తుంది.  ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్లు వారి దేశంతో  సంబంధం లేకుండా వేర్వేరు జట్టులకు అమ్ముడుపోయినట్లు మన నేతలు కూడా లాభం అనిపించే పార్టీలో  చేరిపోతారు. వారిని మంచివారు, చెడ్డవారు అని విభజించలేం.  నిజానికి వర్తమాన రాజకీయాల్లో మంచివారు ఇమడలేరు కూడా.  రాజకీయాల్లో కొనసాగుతున్నవారిలో పేదవారెవరూ లేరు. అదనంగా, అక్రమంగా కూడిన సొమ్మునే ఎన్నికలకు ఇంధనంగా వాడుతారు.  గెలిస్తే పవర్,  ఒకవేళ ఓడినా పోయేదేమీ లేదు. అంతా ధనబలం ఉన్నవారే  నాయకులుగా కొనసాగుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో మారిన ప్రభుత్వాలు

గత ఆరు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చేశాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ బెలూన్ లోంచి కొంత గాలిని తగ్గించి మరీ ఎత్తుకు ఎగరకుండా సార్వత్రిక ఎన్నికలు కట్టడి చేశాయి.  తెలంగాణాలో  ఆరు నెలలకే  కొత్త పాలన రుచి నచ్చనట్లు ప్రజలు సాధారణ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను ప్రదర్శించారు. ఇక్కడ అంతా స్తబ్ధతగా ఉంటే ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభిషేకం వైభవోపేతంగా సాగింది.  రాజు యుద్ధంలో  గెలిచి రాజ్యానికి చేరుకోగానే  ప్రజలు జేజేలు పలికినట్లు ఉందా సందడి. ఈ చంద్రబాబునే కాదని 2019లో వైసీపీ చీఫ్​ జగన్ కు జనాలు  పట్టం కట్టారు. అదే ప్రజలు ఇప్పుడు జగన్​ను ఛీ కొట్టారు.  

విజన్​‘బాబు’

చంద్రబాబు దీర్ఘకాలంగా తెలుగు ప్రజలను ఏలిన నేత. ఈ కాలపు అభివృద్ధి పట్ల విజన్ ఉన్న నేతగా పేరు ఉంది. ఆధునిక విద్య, ఉద్యోగ కల్పన, ప్రపంచంతో పోటీ ఆయనకు ఆసక్తి గల అంశాలని తెలుస్తోంది. అయితే ఈ విజన్​లే  ఆయనను 2004లో ఉమ్మడి రాష్ట్రంలో,  2019లో ఏపీలో  సామాన్య  ఓటరుకు దూరం చేశాయనవచ్చు.  ఓట్లు ఎలా వస్తాయంటే పింఛన్లు పెంచాలి,  యువతుల పెండ్లికి ఖర్చులీయాలి,  మహిళలకు ఆదాయానికి లింక్ లేకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.  ఇలాంటి తక్షణ ఆర్థిక సహాయానికి జనం ఓటు వేస్తారనే నమ్మకంతో ఆయన కూడా రూటు మార్చి అభివృద్ధి మాటను పక్కనబెట్టి సంక్షేమ పథాన్ని పట్టారు. ఎన్నో ఆశలు కల్పిస్తే తప్ప బాబుకు పీఠం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాటేమోగాని బాబులో ఆయన  స్వప్నం సాకారమైందన్న ఆనందమే పరవళ్లు తొక్కుతోంది. 

ఆరు నెలల క్రితమే తెలంగాణలో సంబురాలు

ప్రభుత్వ మార్పు సంబరాన్ని తెలంగాణ ప్రజలు ఆరు నెలల క్రితం చూశారు.  పత్రికలు రేవంత్  రెడ్డి గెలుపు కన్నా కేసీఆర్ ఓటమికి కారణాలే వెదికాయి.  వ్యక్తిగతంగా  రేవంత్ విజయవంతమైనా కొత్తగా రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని నమ్మేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు కాబట్టి ఆయన నిజాయితీ పట్ల కొందరికి శంక ఉంటుంది. రాష్ట్రంలో సన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మకం, బీర్ల అమ్మకానికి కొత్త కంపెనీల అనుమతిలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ అంటోంది.  గొర్రెల స్కామ్, ఫోన్ టాపింగ్ అని కాంగ్రెస్ పార్టీ  పాము, ముంగిస ఆట ఆడుతోంది. అదేవిధంగా ఏపీలో బాబు సంబరం కూడా నగదు హామీల అమలులో  తేలిపోతుంది. అప్పు చేసి పప్పు కూడు పథకాలే ఓట్లు రాల్చితే దేశమే గతి బాగుపడునోయ్ అనక తప్పదు.  తనతో  కానప్పుడు పాత సర్కారు తప్పులను వేటాడుతూ కాలం గడపవచ్చు. ఇదే నేటి రాజకీయం. మన దేశంలో అభివృద్ధి పాలకుల వల్ల జరగడం లేదు. పాలకులు పారిశ్రామికవేత్తల  తొత్తులుగా దేశ సంపదను వారికి దోచిపెడుతున్నారు.  ఇందులో హెచ్చుతగ్గులు ఉండవచ్చుగానీ  కాంగ్రెస్, బీజేపీ, మరే పార్టీ దీనికి మినహాయింపు కాదు. 

ఎన్నికలంటే ఆశలు నెరవేరే పర్వం కాదు

మన జనాభాలో 30 ఏండ్లలోపువారు 30 % ఉన్నారు. వారిలో 80 % నిరుద్యోగులే. అంటే నిలకడ గల ఉద్యోగం, నికరమైన ఆదాయం లేకుండా బతుకుతున్నారు. వారి పరిస్థితికి  వృత్తి నిపుణతలేమియే అసలు కారణం. జపాన్ లో 80 % యువత నైపుణ్యం గలవారైతే మన దేశంలో కేవలం 3 % మాత్రమే. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ ఈ దిశగా హామీలు ఈయలేదు. ప్రపంచ దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరిగెత్తితే మన దగ్గర మాత్రం అభివృద్ధి అశ్వాన్ని వెనక్కి కట్టి పరుగెత్తమంటున్నారు. ప్రజలకు ఓటు ఒక సందర్భమే తప్ప ఆశలు నెరవేరే పర్వం కాదు.

విదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్న యువత

ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే దేశంలోని యువత, విద్యావంతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, శాస్త్ర, వైజ్ఞానిక పరిశోధకులు తమ భుజాల మీదుగా అభివృద్ధిని మోస్తూ నడిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అప్పులు, ఎన్నికల్లో బూటకపు మాటలతో ఒకవైపు ప్రభుత్వాలు కాలం గడుపుతుంటే, తమ విజ్ఞానకాంతులతో యువత విదేశీ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కంపెనీలు కోరిన రాయితీలు ఇచ్చి, వాటి ఆఫీసుల రిబ్బన్లు కట్ చేసి ఉపన్యాసాలు దంచి ఇదంతా తమ గొప్పతనమే అని నేతలు చెప్పుకుంటున్నారు. అప్పులు, అబద్ధాలు నేతలవి అయితే విజ్ఞానం, అభివృద్ధి ఇక్కడి ప్రజల సృష్టి.  మన దేశం ప్రపంచాన్ని శాసించే దిశగా సాగుతోంది అనే మాటలు సత్యదూరమైన భ్రమకల్పనలు. 

- బి. నర్సన్,సీనియర్​ జర్నలిస్ట్