న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేశారు. ఫలితాలు కచ్చితంగా మహా వికాస్ అఘాడికే అనుకూలంగా వస్తాయని అందరూ ఆశించారు. ఉదాహరణకు.. నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో మా పార్టీ అభ్యర్థే గెలిచారు.
కానీ, ఆ కానిస్టెన్సీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పార్టీ అభ్యర్థులందరూ ఓడిపోయారు. ఇంత తేడా ఎలా ఉంటుంది? మాకు రాష్ట్రం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నందున మేము కూడా ఆందోళన చెందుతున్నాము. ఇది తప్పు అని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రజలు అంటున్నారు.
అందుకే నేను మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలవడానికి వచ్చాను” అని ఆయన అన్నారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ తాను రాష్ట్ర శాఖ పదవి నుంచి వైదొలిగినట్టు వచ్చిన ఆరోపణలను పటోలే ఖండించారు. తాను రాజీనామా చేయలేదని పటోలే తెలిపారు.