కరీంనగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారో.. విధ్వంసం సృష్టించే బీజేపీ వైపు ఉంటారో తేల్చుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి సిటీలోని భగత్ నగర్, కోతి రాంపూర్, మారుతి నగర్, సెయింట్ జాన్ హై స్కూల్ వద్ద మేయర్ యాదగిరి సునీల్‌రావుతో కలిసి గంగుల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో భార్య మెడలో పుస్తెలు అమ్మానని చెప్పిన బండి సంజయ్.. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఎలా ఖర్చుపెడుతున్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే కరీంనగర్ అభివృద్ధి కుంటుపడుతుందని.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు.
30న జరిగే ఎన్నికలు కరీంనగర్ భవిష్యత్‌ను నిర్ణయించేవని, కరీంనగర్ అభివృద్ధిని కాంక్షించే వాళ్లు కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ నాలుగున్నరేళ్లలో సిటీ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక పైసా కూడా తేలేదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా విఫలమైన సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సిటీ అభివృద్ధికి ఏం హామీలు ఇచ్చాడో చెప్పాలన్నారు. బండి సంజయ్ నిజమైన హిందువు కాదని.. తానే నికార్సైన హిందువుననని గంగుల స్పష్టం చేశారు. రోడ్ షోలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి, సిటీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు గులాం అహ్మద్, ఆయా డివిజన్ల
కార్పొరేటర్లు పాల్గొన్నారు.
త్యాగానికి, దేశభక్తికి మరోపేరు సిక్కులు
త్యాగానికి, దేశభక్తికి మరోపేరు సిక్కులు అని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా సిక్ వాడిలోని గురుద్వారలో ప్రత్యేక పూజలు చేశారు. మత గురువులు , సిక్కు సోదరులతో కాసేపు మాట్లాడారు. సిక్కు మత గురువులు మంత్రి గంగుల కమలాకర్ కు ఘనస్వాగతం పలికి, సత్కరించి తలపాగా చుట్టారు.