- నోటిఫికేషన్ జారీ చేసిన రక్షణ శాఖ
- 2006 చట్టం ప్రకారమే ఎన్నికల నిర్వహణకు నిర్ణయం
- సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 8 వార్డులకు లక్కీ డ్రాతో రిజర్వేషన్లు కేటాయింపు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల తేదీని ప్రకటిస్తూ రక్షణ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. పార్లమెంటులో నూతన చట్టం అమలు చేసేందుకు ప్రక్రియ మొదలయినప్పటికీ బిల్లు పెండింగ్‌లో ఉండడంతో 2006 చట్టం ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించారు. రెండేండ్ల క్రితమే కంటోన్మెంట్ పాలక మండలి పదవీ కాలం ముగిసింది. ఏడాదిగా నామినేటెడ్ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపాలన్న విలీన ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఉన్న కంటోన్మెంట్లలో అతి పెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 4 లక్షల జనాభా ఉంది. విస్తీర్ణాన్ని బట్టి కంటోన్మెంట్‌ను 8 వార్డులుగా నిర్ణయించారు. వీటికి బోర్డు అధికారులు లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు నిర్ణయించారు. కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీల్లో కలిపే ప్రక్రియకు కేంద్రం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సైతం సమ్మతిని తెలుపుతూ సమాధానం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.
గుర్తులు లేకుండా ఎన్నికలు..
దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లకు పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేసినా వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయించరు. నేరుగా అభ్యర్థులు పార్టీల నుంచి పోటీ చేయరు. ఒక్కో పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీ చేసినా ఆయా పార్టీలు జారీ చేసే విప్‌లు వర్తించవు. అందువల్ల ఈ ఎన్నికల్లో అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.