నా ర్త్ఈస్ట్లో ఎన్నికల వేడి మరింత ఎక్కువయ్యింది. ఈ నెల 16న త్రిపురలో జరిగే ఎలక్షన్స్ దేశంలోనే కీలకం కానున్నాయి. ఇందులో గెలవడం బీజేపీకి ఎంతో ముఖ్యం. అయితే ఎప్పటి నుంచో పాతుకుపోయిన సీపీఎం, కాంగ్రెస్ కూటిమి గెలుస్తుందా? లేదా కొత్తగా పుట్టిన ‘తిప్రా మోతా’ అక్కడ మోత మోగిస్తుందా? లేదా బీజేపీయే తిరిగి గెలుస్తుందా? విశ్లేషకులను సైతం కన్ఫ్యూజ్ చేస్తున్నది.
చారిత్రక రాష్ట్రం
త్రిపుర పెద్ద రాష్ట్రమేమీ కాదు. 41 లక్షల జనాభాతో, కేవలం 60 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న రాష్ట్రం. ఇక్కడ 1325లో మొదటి రాజవంశం పాలనలో ఉండేది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపురకు గొప్ప చరిత్రే ఉంది. ఇతర రాష్ట్రాల మాదిరి కాకుండా హిందూ మెజారిటీ ఉన్న రాష్ట్రం కావడమే దాని స్పెషాలిటీ. 1972లో త్రిపుర ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అప్పటి నుంచి దాదాపు 35 ఏండ్ల పాటు అక్కడ సీపీఎం అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ 7 ఏండ్లు పాలించింది. అప్పటికి బీజేపీ ఛాయలు కూడా అక్కడ పడలేదు. 2018లో బీజేపీ తన జెండా ఎగురవేసింది.
ఎన్నో ప్రశ్నలు..
ఈ ఐదేండ్ల పాలన వల్ల బీజేపీకి ప్రజాదరణ ఉందా పోయిందా? సీపీఎం, కాంగ్రెస్ కూటమి పని చేస్తుందా? అయితే, 1972 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్, సీపీఎం మిత్రపక్షాలుగా మారాయి. సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు సీపీఎం పట్ల తమకున్న శత్రుత్వాన్ని మరిచిపోతారా? త్రిపుర కుటుంబానికి చెందిన మాజీ మహారాజు ‘తిప్రా మోతా’ అనే కొత్త పార్టీని స్థాపించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ పార్టీ విజయం సాధించింది. త్రిపురలోని 60 ఎమ్మెల్యే స్థానాల్లో 20 గిరిజనులకు కేటాయించారు. త్రిపుర ఇప్పుడు 3 పార్టీల మధ్య ఎన్నికల యుద్ధంలా మారినది.
బీజేపీ ముందున్న సవాళ్లు..
హిందూ మెజారిటీ రాష్ట్రంగా త్రిపురను బీజేపీ తిరిగి నిలబెట్టుకోవాలి. పాలన సరిగ్గా లేని కారణంగా 4 ఏళ్ల తర్వాత బీజేపీ తన ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్‌ను మార్చాల్సి వచ్చింది. ఇది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రద్యుత్ మాణిక్ కొత్త పార్టీ ‘తిప్రా మోత’ ఖచ్చితంగా బీజేపీ ఓట్లను చీలుస్తుంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య తీవ్ర హింస జరిగేది. 35 ఏళ్లు సీపీఎం పాలించినందున సీపీఎం మంచి, చెడులు అక్కడి ప్రజలకు బాగా తెలుసు. ఇది ఒకరకంగా బీజేపీకి కలిసి వచ్చే అంశం. ఓటర్లు బీజేపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకోవచ్చు, త్రిపురలో నరేంద్ర మోడీకి మంచి ఆదరణ ఉంది. అయితే స్థానిక ఓటర్లు పాత సీపీఎం-, కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారా లేదా అనేది సమస్య.
సీపీఎం, కాంగ్రెస్ పొత్తు..
త్రిపురలో సీపీఎం 1972 నుంచి 35 ఏళ్లు పాలించింది. ఇప్పుడు త్రిపురలో 7 ఏళ్లపాటు పాలించిన సంప్రదాయ ప్రత్యర్థి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. గత ఐదేళ్లు మినహా త్రిపురను సీపీఎం, కాంగ్రెస్‌లు అన్ని కాలాలూ పాలించాయి. కనుక త్రిపురలో సీపీఎం, కాంగ్రెస్ రెండూ పాత ముఖాలే. కొత్త ముఖాలు బీజేపీ, తిప్రా మోత .
‘తిప్రా మోత’ త్రిపుర మహారాజ పార్టీ
బీజేపీ, సీపీఎం కూటమి ఒకదానికొకటి తలపడుతుండగా, తిప్రామోత ఇటీవల జరిగిన గిరిజన సంఘం ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. హంగ్- అసెంబ్లీ ఉంటే, ఇతర పార్టీలు దానితో బేరం చేసి గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి అంగీకరిస్తాయని భావిస్తోంది.
మునుపటి సమస్యలు
బీజేపీ ప్రభుత్వం ఓడిపోతే, ఆదివాసీలు, బెంగాలీల మధ్య మునుపటిలా హింస జరగవచ్చని మెజారిటీ బెంగాలీ జనాభాకు తెలుసు. 2023లో ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున త్రిపురను గెలవడం బీజేపీకి చాలా ముఖ్యం. బీజేపీ త్రిపురలో గెలవకపోయినా, దాని ప్రత్యర్థులు గెలవకూడదని కోరుకోవడం సహజం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నార్త్ బీజేపీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. త్రిపురలో గెలుపోటములు అతని కీర్తిని కూడా ప్రభావితం చేస్తాయి.
ఎవరు గెలుస్తారు ?
త్రిపురను అభివృద్ధి చేస్తామనే నినాదంతో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కేంద్ర ప్రభుత్వం త్రిపురకు మద్దతు ఇస్తుందని, ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారును గెలిపించాలని మోడీ అన్నారు. త్రిపుర ఏర్పాటైనప్పటి నుంచి గత ఐదేళ్లు మినహా సీపీఎం, కాంగ్రెస్ పార్టీలే పాలించాయని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు మోడీ కొన్ని కఠోర వాస్తవాలను ప్రజలకు గుర్తు చేశారు. అధ్వాన్నమైన పాలన కారణంగా బీజేపీ అక్కడి సీఎంను మార్చాల్సి వచ్చింది. కానీ 5 ఏండ్లు గడచిపోయాయి కనుక ఈ సారి ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కష్టమే. సీపీఎం–-కాంగ్రెస్ కూటమికి గతసారి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. అయితే 35 ఏళ్లుగా త్రిపురను పాలించిన సీపీఎంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంతంగా మెజారిటీ సాధించలేమని తిప్రా మోతకు తెలుసు. అయితే అది కింగ్ మేకర్ అవ్వాలనుకుంటోంది. అది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్