ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ఆసక్తి చూపని టీచర్లు...గత ఎన్నికల్లో 2,043 మంది

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ఆసక్తి చూపని టీచర్లు...గత ఎన్నికల్లో 2,043 మంది
  • ఈసారి ఇప్పటి వరకు 579 మందే ఓటర్లు..
  • ఓటరు నమోదుకు ఇంకా 11 రోజులే గడువు
  • పోటీ ఆలోచనలో కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్స్​ 
  • ఇప్పటికే యూటీఎఫ్, పీఆర్టీయూ క్యాండిడేట్స్​ ప్రకటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్​ జిల్లాల టీచర్స్​ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఓటరు నమోదు మొదలై 25 రోజులవుతున్నా భద్రాద్రికొత్తగూడెం  జిల్లాలో టీచర్లు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. గత టీచర్స్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 2,043 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకోగా, ఈసారి మాత్రం ఇప్పటి వరకు కేవలం 579 మందే నమోదు చేసుకున్నారు. ఓటర్​ నమోదుకు ఇంకా 11 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. 

నిర్లక్ష్యం దేనికీ..? 

టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. అక్టోబర్​1 నుంచి నవంబర్​ 6 వరకు ఓటరు నమోదుకు గడువు పెట్టింది. ఓటరు నమోదు మొదలై 25 రోజులు గడుస్తున్నా భద్రాద్రికొత్తగూడెం టీచర్లు ఆసక్తి చ ఊపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 2,043 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు 579 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. టీచర్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్​ అసిస్టెంట్స్​కు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఉన్నత చదువులు చదివిన స్కూల్​ అసిస్టెంట్స్​ ఓటరు నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు జరిగినా  డ్యూటీలు నిర్వహించే టీచర్లు తమ తరుఫున పోటీ చేసే ఎన్నికలకు సంబంధించి నిర్లక్ష్యంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన..

త్వరలో జరగబోయే టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్​ తరఫున అలుగుబెల్లి నర్సిరెడ్డిని, పీఆర్టీయూ తరఫున శ్రీపాల్​రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. అలుగుబెల్లి ప్రస్తుతం  ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో సారి పోటీలోకి దిగారు. ఆయా యూనియన్ల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే విషయమై కసరత్తు చేస్తున్నాయి.