
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది 1950 జనవరి 25న ఏర్పడింది. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలను మొదలుకొని ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొదలుకొని ఎలక్టోరల్ బాండ్ల వరకు విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెటిన సంస్కరణలను తెలుసుకుందాం.
జాతీయ ఓటర్ల దినోత్సవం
ఎన్నికల సంఘం (1950, జనవరి 25) ఏర్పడి 60 సంవత్సరాలైన సందర్భంగా యువతను ఓటర్ల జాబితాలో చేర్చడానికి ఎన్నికల సంఘం 2011 నుంచి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినంగా పాటిస్తున్నది. ఫ్రౌడ్ టు బి ఓటర్– రెడ్ టు ఓట్ అనే క్యాప్షన్‌తో ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
సీవిజిల్, విశిష్ట గుర్తింపు సంఖ్య
ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి ఎన్నికల అక్రమాలను అరికట్టడానికి ఎన్నికల కమిషన్ cVigilant Citizen అనే మొబైల్ యాప్‌ను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా 2018లో ప్రారంభించింది. ఆధార్‌లాగే ప్రతి ఓటర్‌కు ఓ విశిష్ట సంఖ్య ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబర్ పేపర్ ఆడిట్ ట్రయల్)
సుబ్రమణ్య స్వామి కేసు(2013)లో సుప్రీంకోర్టు ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తాను ఓటేసిన అభ్యర్థి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడి ముద్రిత పేపర్ స్లిప్‌ను పొందడానికి వీలుగా ఈవీఎంల్లో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ ప్యాట్) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సౌకర్యాన్ని మొదటిసారి 2013, సెప్టెంబర్‌లో నాగాలాండ్‌లోని నోక్సెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వినియోగించారు.
నోటా(నన్ ఆఫ్ ది అబో)
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ 2004లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 2013 సెప్టెంబర్‌లో ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థులందరి పేర్లకు దిగువన నోటా మీట పెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిని 2013లో మొదటగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అమలు చేశారు. 2014 లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అమలు చేశారు. దీనిద్వారా ప్రపంచంలో నోటాను ప్రవేశపెట్టిన 14వ దేశంగా ఇండియా అవతరించింది. 2014 ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో నోటా రంగు తెలుపు రంగులో అసెంబ్లీకి సంబంధించి గులాబీ రంగులో ఉపయోగించబడింది.
సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్
దేశంలో ఓటర్లను విద్యావంతులను చేయడం కోసం 2009 నుంచి ఎన్నికల సంఘం ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటరు అవగాహన సదస్సును నిర్వహించడం, ఓటర్ల అక్షరాస్యతను పెంచడం, ఎన్నికల ప్రక్రియపై ప్రాథమిక అవగాహనను కల్పించడం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. గ్రేటర్ పార్టిసిపేషన్ ఫర్ ఏ స్ట్రాంగర్ డెమోక్రసీ అనే ఎస్వీఈఈపీ కార్యక్రమం క్యాప్షన్.
రిమోట్ ఓటింగ్ ఫెసిలిటీ
మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం, ఓటర్ టర్నౌట్‌ను పెంచడం కోసం ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా దేశంలోని ఏ పోలింగ్ స్టేషన్ నుంచైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టును బ్లాక్‌చైనా టెక్నాలజీని ఉపయోగించి ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేస్తోంది.
ఎలక్టోరల్ బాండ్లు
2018 సంవత్సరం బడ్జెట్లో కొత్తగా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే వారు బ్యాంకులో ఆ మొత్తాన్ని డిజిటల్ చెల్లింపులు లేదా చెక్కుల ద్వారా చెల్లించాలి. అంతే మొత్తానికి బాండ్ల రూపంలో తీసుకొని రాజకీయ పార్టీలకు అందించవచ్చు. ఈ బాండ్లపై గరిష్ఠ పరిమితి లేదు. ఈ బాండ్ల కాలపరిమితి 15 రోజులు. ఎలక్టోరల్ బాండ్లపై దాత పేరును పేర్కొనరు. అంటే బేరర్ బ్యాంకింగ్ ఉపకరణం. ఇది ప్రామిసరీ నోట్ రూపంలో జారీ చేస్తారు. ఇవి సంవత్సరంలో జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో 10 రోజులపాటు అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లను రాజకీయ పార్టీలు బ్యాంకుల్లో రీడీమ్ చేసుకుని మొత్తాన్ని పొందవచ్చు.
నూతన ఎన్నికల వ్యయ పరిమితి
2014లో ఎన్నికల వ్యయ పరిమితిని సవరించడం కోసం హరీష్‌కుమార్, ఉమేశ్ సిన్హా, చంద్రభూషణ్ కుమార్ల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వీరు ధరల ద్రవ్యోల్బణ సూచీ, పెరిగిన ఎలక్టార్స్ సంఖ్య ఆధారంగా ఎన్నికల వ్యయపరిమితిని పెంచింది. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పెద్ద రాష్ట్రాల్లో రూ.95లక్షలు, చిన్న రాష్ట్రాల్లో 75 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పెద్ద రాష్ట్రాల్లో రూ.40లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.28లక్షలు ఖర్చు చేయవచ్చు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు
మన దేశంలో మొదట ఈవీఎంలను 1998 నవంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌లోని 5, రాజస్తాన్‌లోని 5, ఢిల్లీలోని 6 అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించారు. 2014లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను వినియోగించడమైంది. ఈవీఎంల్లో బ్రెయిలీ సంకేతాల సదుపాయాన్ని 2004లో ఉమ్మడి ఏపీలోని ఆసిఫ్ నగర్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు. 2009లో 15వ లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేశారు. 2015 మే 1 తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లో ఈవీఎం, బ్యాలెట్ పత్రాలపై పోటీచేసే అభ్యర్థుల ఫొటో ఉండేలా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.