పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్​ రాజర్షి షా

పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించాలి  : కలెక్టర్​ రాజర్షి షా
  • జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : ఈనెల 13న ఎంపీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, కరెంట్, వీల్ చైర్స్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.  గుర్తింపు కార్డులు లేనివారిని పోలింగ్​ కేంద్రాల్లోకి అనుమతించొద్దని, సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని తెలిపారు.

నార్నూర్, గాదిగూడలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని, మిగతా జిల్లాలో సాయంత్రం 6 గంటలకు సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదారు కంటే ఎక్కువ మంది గుంపుగా ప్రచారం చేయకూడదని చెప్పారు.

ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టెలీకాన్ఫరెన్స్ లో ఏఆర్వోలు, రెవెన్యూ, సెక్టోరల్ అధికారులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలి..

ఆసిఫాబాద్, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆసిఫాబాద్  కలెక్టర్‌‌  వెంకటేశ్​ ధోత్రే సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​ నుంచి అంబేద్కర్  చౌరస్తా వరకు చేపట్టిన 5కే రన్ ను అడిషనల్​ కలెక్టర్  దీపక్  తివారి, అడిషనల్  ఎస్పీ ప్రభాకర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో విలువైందని, అభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

పోలింగ్‌‌ శాతాన్ని పెంచేందుకు కళాజాత ప్రదర్శన, ఇంటింటి ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. హోమ్  ఓటింగ్  ద్వారా ఆసిఫాబాద్ లో వంద శాతం పోలింగ్​ సాధించామని, సిర్పూర్ లో కూడా సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.