బాత్రూమ్ లో కరెంట్ షాక్!ముగ్గురు మృతి

బాత్రూమ్ లో కరెంట్ షాక్!ముగ్గురు మృతి
  •      ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 
  •     హైదరాబాద్ లో ఘటన 

సికింద్రాబాద్/పంజగుట్ట, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఒకే ఇంట్లోని ముగ్గురు మృతి చెందిన ఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. సనత్​నగర్​ జెక్​ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్ మెంట్ ఫ్లాట్​నెంబర్ 204లో ఆర్.వెంకటేశ్​(59), ఆయన భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ(25) ఉంటున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటేశ్​ కుటుంబం కొన్నాళ్లు విశాఖపట్నంలో ఉండి, 2014లో హైదరాబాద్ కు వచ్చింది. వెంకటేశ్ సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకింగ్ సొల్యూషన్స్ సంస్థలో బిజినెస్ హెడ్ గా పని చేస్తున్నాడు. 

కుమారుడు హరికృష్ణ ఆటిజంతో బాధపడుతుండగా, అతణ్ని చూసుకుంటూ మాధవి ఇంటి వద్దనే ఉంటున్నది. వీళ్ల ఇంట్లో పనిచేసే వరలక్ష్మి ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఫ్లాట్ కు వచ్చింది. తలుపు తీసే ఉండడంతో కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారనుకుని వంటింట్లో పని చేసి వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చింది. అయితే అప్పుడు  కూడా ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికింది.

 ఎవరూ కనిపించకపోవడంతో అనుమానంతో తిరిగి వెళ్లింది. మళ్లీ సాయంత్రం 6 గంటలకు విజయలక్ష్మి అనే మరో పని మనిషితో కలిసి వరలక్ష్మి ఫ్లాట్ కు వచ్చింది. వాళ్లిద్దరూ బలవంతంగా బాత్రూమ్ డోర్ తెరిచి చూడగా వెంకటేశ్, ఆయన భార్య మాధవి, కుమారుడు హరికృష్ణ మృతి చెంది ఉన్నారు. హరికృష్ణ ఒంటిపై దుస్తులు లేకుండా తలుపుకు అడ్డంగా పడి ఉన్నాడు. 

అది చూసి భయపడిపోయిన వరలక్ష్మి, విజయలక్ష్మి, వాచ్​మన్​  సత్యనారాయణ, అపార్ట్ మెంట్ వాసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. సనత్​నగర్ పోలీసులతో పాటు క్లూస్ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. డెడ్​బాడీలను గాంధీ మార్చురీకి తరలించారు. బెంగుళూర్​లోని బంధువులకు సమాచారం అందించారు. 

కుమారుడికి స్నానం చేయిస్తుండగా.. 

హరికృష్ణ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతనికి తల్లిదండ్రులే స్నానం చేయిస్తుంటారని అపార్ట్ మెంట్ వాసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుమారుడికి స్నానం చేయిస్తుండగా, కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు బాత్రూమ్ లో గ్యాస్ గీజర్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ముగ్గురి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఏమైందనేది తెలియనుంది.