హైదరాబాద్:గణేష్ పండుగ వేళ..నల్లకుంటలో విషాదం చోటుచేసుకుంది.నల్లకుంట పరిధిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. నల్లకుంట రైల్వే ట్రాక్ సమీపంలోని నారాయణ కాలేజీ ఎదురుగా కొంతమంది యువకులు శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం ఏర్పాటు చేశారు.
ఆదివారం మండపం వద్ద ఉన్న లౌడ్ స్పీకర్ పాడైపోవడంతో యువకులు దానికి మరమ్మతులు చేయించారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో మర మ్మ తు చేసి తీసుకొచ్చిన లౌడ్ స్పీకర్ ను అసోసియేషన్ సభ్యుడైన పద్మ కాలనీకి చెందిన పాండు(26) మండపంపైన ఫిట్ చేసి కరెంట్ కనెక్షన్ ఇస్తున్నాడు.
అయితే అక్కడ వేలాడుతున్న కరెంటుతీగ పాండుకు తగలడంతో అతను విద్యుత్ ఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో స్నేహితులు అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాండు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.