నిజామాబాద్ మీదుగా ఎలక్ర్టిక్​ ట్రైన్లు..

  • త్వరలో ఉమ్మడి నిజామాబాద్​జిల్లా మీదుగా కరెంట్​ఇంజన్​తో నడిచే రైళ్లు
  • పూర్తయిన ఎలక్ర్టిఫికేషన్​ పనులు​

కామారెడ్డి,వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీదుగా త్వరలో కరెంట్​ఇంజన్ తో నడిచే రైళ్లు పరిగెత్తనున్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి నిజామాబాద్ ల మధ్య చేపట్టిన ఎలక్ర్టిఫికేషన్​ పనులు కంప్లీట్ అయ్యాయి. మనోహరాబాద్ – కామారెడ్డిల మధ్య ఉన్నత అధికారులు టెస్ట్​ రైడ్​కూడా చేశారు. సికింద్రాబాద్ నుంచి ఉత్తర భారతదేశానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీదుగా రైల్వే లైన్ దగ్గరగా ఉంటుంది. ఈ మార్గంలో రైళ్లను నడపడం ద్వారా దూర భారం తగ్గుతుంది. కానీ సింగిల్ లైన్ కావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను ఈ మార్గంలో నడపడం లేదు. సికింద్రాబాద్ నుంచి ముంబైకి దేవగిరి ఎక్స్​ప్రెస్, నిజామాబాద్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్​ప్రెస్, ఆదిలాబాద్ ​నుంచి తిరుపతికి కృష్ణా ఎక్స్​ప్రెస్​తో పాటు మరికొన్ని రైలు, సికింద్రాబాద్ నుంచి నాందేడ్, మన్మాడ్ వరకు తిరుగుతున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లకు సంబంధించిన ఇంజన్లను సికింద్రాబాద్ వెళ్లిన తర్వాత మారుస్తున్నారు. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ లు కలిపి రోజూ55కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సింగిల్ లైన్ ఉండటం వల్ల క్రాసింగులు, డీజిల్ ఇంజన్ తో నడిచే రైలు కావడంతో ప్రయాణం ఆలస్యమవుతుంది. సికింద్రాబాద్ నుంచి  మహారాష్ట్రలోని ముత్కేడ్ మధ్య ఎలక్ట్రికల్ లైన్ కోసం 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఫండ్స్ మంజూరయ్యాయి. కొంతకాలం కిందట సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్​వరకు కరెంట్​లైన్ పనులను పూర్తి చేశారు. మనోహరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ఆరు నెలల కిందట పనులు షురూ అయ్యాయి. మనోహరాబాద్ నుంచి కామారెడ్డి వరకు 67 కిలోమీటర్ల పనులు నెలకిందటే కంప్లీట్ అయ్యాయి. సబ్ స్టేషన్ల నిర్మాణం, కరెంట్​లైన్లు వేయడం, మినీ ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేశారు. రాజంపేట మండలం తలమడ్ల రైల్వే స్టేషన్ వద్ద 220 కేవీ సబ్ స్టేషన్ ను నిర్మించారు. ఇటీవల రైల్వే ఉన్నత అధికారులు ఈ మార్గంలో కరెంట్ ఇంజన్​తో  టెస్టింగ్​చేసి పనులను పరిశీలించారు. మనోహరాబాద్​నుంచి కామారెడ్డి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా కరెంట్​రైలు ఇంజన్ వచ్చింది.  కామారెడ్డి నుంచి నిజామాబాద్​కు52 కిలోమీటర్ల మేర పనులు కూడా ఇటీవల పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి బాసర మధ్య పనులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నుంచి కరీంనగర్ మధ్య పనులు కూడా పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్నతాధికారులు టెస్టింగ్ చేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కరెంట్​ఇంజన్లతో రైలు నడవడం ద్వారా రైళ్ల వేగం పెరుగుతుంది. దూరం వెళ్లే  రైళ్లకు ఇంజన్ మార్చే అవకాశం ఉండదు.